ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సహాయ కార్యదర్శి హోదా కంటే పై స్థాయి కలిగిన అధికారులు ఇకపై రోజూ విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం నిర్దేశించింది. అంతకంటే కిందిస్థాయి ఉద్యోగుల్లో ప్రతి శాఖ నుంచి 33% మంది వస్తే సరిపోతుందని, సంబంధిత కార్యదర్శి ఈ మేరకు ఆదేశాలు జారీచేయాలని పేర్కొంది.
కేంద్ర హోం శాఖ కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో.. కంటెయిన్‌మెంట్ జోన్లలో మినహా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలోని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలని పేర్కొంది. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు తీసుకుంటూనే విధులు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.
* మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగం, శ్వాసకోశ, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు, కీమోథెరపీ తీసుకుంటున్న వారు విధులకు రానక్కర్లేదు. వారికి మినహాయింపు ఉంటుంది.
* గర్భిణులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం.
* ప్రతి ఉద్యోగి శానిటైజర్ ఉపయోగించాలి. అన్నిచోట్లా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.