కరోనా అదుపులో భాగంగా జిల్లాల వారీగా కంటెయిన్‌మెంట్ క్లస్టర్లు, బఫర్ ప్రాంతాల్లో సమర్థ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో జోన్లవారీగా నిషేధిత కార్యకలాపాలు, అనుమతించాల్సిన పనుల విషయమై కేంద్రం జారీచేసిన సూచనలను ప్రస్తావించింది. దీనికి అనుగుణంగా కంటెయిన్‌మెంట్ ప్రాంతాలను ప్రకటించి మ్యాపింగ్ చేసేందుకు.. కేసుల తీవ్రత ఆధారంగా క్లస్టర్లను ఎంపికచేసి 24 గంటల్లో ప్రభుత్వానికి పంపాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
కంటెయిన్‌మెంట్ క్లస్టర్లలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు
- పాజిటివ్ కేసుల వారీగా మ్యాపింగ్, వారితో సంబంధం ఉన్నవారు.
- భౌగోళికంగా వాటిని విశ్లేషించడం.
- కరోనా అదుపు కోసం అక్కడ తీసుకుంటున్న చర్యల అమలు తీరు.
- కేసులు, అక్కడ వైరస్ వ్యాప్తి ఆధారంగా ప్రధాన ప్రాంతానికి చుట్టూ 500 మీటర్ల నుంచి కిలోమీటరు పరిధి వరకు కోర్ ఏరియాగా గుర్తించాలి. కోర్ ఏరియా చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిని బఫర్‌జోన్‌గా ఉంచాలి. అక్కడ పూర్తిస్థాయి నిఘాతోపాటు వైద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలి. ఈ సందర్భంగా కేంద్ర కుటుంబ సంక్షేమశాఖ జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించాలి.