ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తలసరి కరెంట్‌ వినియోగంలో... దేశంలో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ

విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని... ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు స్థాపిత సామర్థ్యం 7వేల 778 మెగావాట్లు ఉంటే... 2022 వరకు 17 వేల 305 మెగావాట్లకు పెరిగిందని వెల్లడించింది. తలసరి కరెంట్‌ వినియోగంలో... దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేసింది.

telangana electricity
అగ్రస్థానంలో తెలంగాణ

By

Published : May 28, 2022, 11:45 AM IST

విద్యుత్తు మిగులు రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని... ప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర విద్యుత్తు స్థాపిత సామర్థ్యం... రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2022 ఏప్రిల్‌ 1 వరకు 7వేల 778 నుంచి 17వేల 305 మెగావాట్లకు... పెరిగిందని పేర్కొంది. ప్రజలకు నాణ్యమైన కరెంటును 24గంటలూ అందిస్తున్న ఏకైక రాష్ట్రం.. తెలంగాణ అని తెలిపింది. తలసరి కరెంట్‌ వినియోగంలో దేశంలోనే.. తెలంగాణ అగ్రస్థానంలో నిలిచినట్లు పేర్కొంది.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగూడెం జిల్లా బయ్యారంలో.. 1080 మెగావాట్ల సామర్ధ్యంతో భద్రాద్రి విద్యుత్కేంద్రం, నల్గొండ జిల్లా దామెరచర్ల వద్ద... 4 వేల మెగావాట్ల సామర్ధ్యంతో యాదాద్రి విద్యుత్కేంద్రం నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించింది. భద్రాద్రి ఇప్పటికే పూర్తయి కరెంట్‌ ఉత్పత్తి జరుగుతోందని వివరించింది. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 23 వేల 667 మంది ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించి... ఆర్టిజన్‌ పేరుతో నియమించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేసింది.

ఉచిత సరఫరాకు రూ.39,200 కోట్ల రాయితీ...మొత్తం విద్యుత్‌లో 40శాతం వ్యవసాయానికే వినియోగిస్తున్నామని, రాష్ట్రం ఏర్పడ్డాక 3 వేల 196కోట్ల వ్యయంతో 6.39లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని పేర్కొంది. ఏడున్నరేళ్లలో ఉచిత సరఫరాకు.. 39వేల 200 కోట్లను రాయితీగా ఇచ్చామని తెలిపింది. ధోబీ ఘాట్లు, లాండ్రీలు, నాయిబ్రహ్మణులకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది. 10వేల చేనేత పవర్‌ యూనిట్లకు కరెంట్‌ ఛార్జీల్లో 50శాతం రాయితీ కింద 34.50 కోట్లు చెల్లించామని పేర్కొంది. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, లైన్లు, పంపిణీ సామర్ధ్యం పెంచడానికి 35వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపింది. ఈ ఏడాది కరెంట్‌ ఛార్జీలను 18శాతం పెంచడానికి... ఈఆర్సీ అనుమతిచ్చిందని వివరించింది. ఛార్జీల పెంపు ద్వారా 6వేల 831 కోట్లు రాబట్టాలని డిస్కంలు ప్రతిపాదించగా 5 వేల 596కోట్ల వరకు పెంపునకు అనుమతిచ్చినట్లు తెలంగాణ సర్కార్‌ చెప్పింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details