రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వేట మళ్లీ మొదలుపెట్టింది. నూతన ఆర్థిక ఏడాది ప్రారంభమై 11రోజులు గడిచాయో లేదో....ఏకంగా 4వేల కోట్ల రూపాయలను బహిరంగ మార్కెట్ నుంచి సమీకరించింది. సాధారణంగా ప్రతి మంగళవారం రిజర్వుబ్యాంకు సెక్యూరిటీల వేలం నిర్వహిస్తూ ఉంటుంది. ఆయా రాష్ట్రాలు పాల్గొని రుణం తీసుకుంటూ ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంగళవారం సెలవులు రావడంతో ఈనెల 7, 11 తేదీల్లో వేలం నిర్వహించారు. ఈ రెండు రోజుల్లో 2 వేల కోట్లు చొప్పున...రాష్ట్ర ప్రభుత్వం రుణం సమీకరించింది. గతంలో 5 ఏళ్ల కాలపరిమితికి మించి బహిరంగ మార్కెట్ రుణం తీసుకునే వీలుండేది కాదు. ప్రస్తుతం 20 ఏళ్ల పాటు తీరుస్తామని రుణం సమీకరిస్తున్నారు. అంతవరకు వడ్డీ, అసలు భారం రాష్ట్రంపైనే ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాల్లో 12, 16, 18, 20 ఏళ్ల కాలపరిమితిలో తిరిగి తీర్చే ఒప్పందం మేరకు వెయ్యి కోట్ల చొప్పున సమీకరించారు. వడ్డీ ధరలు కూడా కొంత ఎక్కువే ఉన్నాయి. 7.29శాతం, 7.34 శాతం, 7.52శాతం చొప్పున వడ్డీ చెల్లించేలా ఆయా రుణ సంస్థలు అప్పులు ఇచ్చాయి.
11రోజుల్లో రూ.4000 కోట్ల రుణ సమీకరణ - ఏపీ న్యూస్
అప్పుల ఊబిలో ఇరుక్కుపోయిన రాష్ట్ర ప్రభుత్వం....నూతన ఆర్థిక సంవత్సరాన్ని కొత్త అప్పులతో ప్రారంభించింది. కొత్త ఏడాది ప్రారంభమై పక్షం రోజులు గడవక ముందే ఏకంగా రూ.4వేల కోట్లు రుణంగా బహిరంగ మార్కెట్ నుంచి సమీకరించింది. తొలినాళ్లలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే....మున్ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటోనని నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలోనే అవసరాలు: కొత్త ఆర్థిక సంవత్సరంలో చేబదుళ్లతోనే ప్రవేశించాల్సి వచ్చిందని సమాచారం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2 వేల416 కోట్ల ఫ్లోటింగ్ రుణంతో సాగుతున్నట్లు బడ్జెట్ ప్రతిపాదనలే తెలిపాయి. అంటే చేబదుళ్లు, ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం వెసులుబాటు కూడా ప్రారంభంలోనే వినియోగించుకోవాల్సి ఉంటుందని కూడా ముందే అంచనా వేశారు. అదే రీతిలో ప్రారంభంలోనే జీతాల చెల్లింపు, పెన్షన్ల చెల్లింపులకు ఈ వెసులుబాటు వినియోగించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. కిందటి ఆర్థిక సంవత్సరం చివరలో కేంద్రం నుంచి దాదాపు 6వేల , కోట్ల వరకు నిధులు రాష్ట్రానికి వచ్చాయని... ఆ మేరకు చెల్లింపులూ చేపట్టారని సమాచారం. ఆ స్థాయి నిధులు రాకపోయి ఉంటే మరింత ఇబ్బంది ఏర్పడి ఉండేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుత బడ్జెట్ అంచనాల మేరకు ఈ ఆర్థిక సంవత్సరం బహిరంగ మార్కెట్ నుంచి 55 వేల కోట్లు రుణంగా సమీకరించనున్నారు. తమకు 74వేల కోట్ల మేర బహిరంగ మార్కెట్ నుంచి రుణపరిమితి కావాలని... రాష్ట్రానికి ఆ మేరకు అవకాశం ఉందని కేంద్రాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. ఏప్రిల్‌లో 5వేల కోట్ల రుణం అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. అయితే తొలి 11 రోజుల్లోనే 4వేల కోట్లు సమీకరించడం విశేషం.
ఇదీ చదవండి:ధాన్యం గొడవ : "ఆంధ్రప్రదేశ్‌లో రాని సమస్య.. తెలంగాణలో ఎందుకు వస్తోంది..?"