తొలి చర్మ నిధి కేంద్రం తెలంగాణలోని ఉస్మానియా ఆసుపత్రిలో ఏర్పాటైంది. హెటిరో డ్రగ్స్, రోటరీ క్లబ్ సాయంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సోమవారం ఆసుపత్రిలో హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. కార్యక్రమంలో హెటిరో డ్రగ్స్ ఛైర్మన్ పార్థసారథిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్కిన్ బ్యాంకుకు అవసరమైన గదుల ఏర్పాటు, ఇతర యంత్ర సామగ్రి కోసం దాదాపు రూ.70 లక్షల వరకు వెచ్చించారు. ఏటా మరో రూ.15 లక్షల వరకు నిర్వహణ కోసం ఖర్చు చేస్తారు. తొలి విడతగా హెటిరో డ్రగ్స్ ఛైర్మన్ పార్థసారథిరెడ్డి రూ.40 లక్షల నిధులను దీనికోసం అందించారు. మున్ముందు పూర్తి సహకారం అందిస్తామన్నారు.
ఏంటీ బ్యాంకు?
ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో ఏటా వెయ్యి వరకు ప్లాస్టిక్ సర్జరీలు జరుగుతున్నాయి. కాలిన గాయాలు, చేతికి, కాళ్లకు శరీరంపై ఇతర భాగాల్లో తీవ్రగాయాలు, గ్రహణం మొర్రి, కుష్ఠు వ్యాధితో వంకర తిరిగిన చేతులు, కాళ్లు సరిచేయడం, తెగిన చేతులు, వేళ్లు అతికించడం.. ఇతరత్రా చికిత్సలకు చర్మం అవసరం అవుతోంది. ఇప్పటివరకు రోగి శరీరంలోని కాళ్లు, చేతులు, తొడలు తదితర భాగాల నుంచి చర్మం సేకరించి గ్రాఫ్టింగ్ ద్వారా గాయాలైన చోటు అమర్చుతున్నారు. రోగి శరీరం నుంచి 15-20 శాతం మాత్రమే ఇలా సేకరించడానికి వీలవుతుంది. అంతేకంటే ఎక్కువ చర్మం కావాల్సిన వచ్చినప్పుడు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఏర్పాటైందే చర్మ బ్యాంకు.
ఎవరి నుంచి సేకరిస్తారంటే..
ప్రస్తుతం బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల నుంచి గుండె, మూత్ర పిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె కవాటాలు, కళ్లు సేకరించి ఇతరులకు అమర్చుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీవన్‌దాన్ ట్రస్టు అనుమతి ఇస్తోంది. చర్మ దానానికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ప్రమాదాల్లో మృతిచెందిన వారి నుంచి కూడా 12 గంటల్లోపు చర్మాన్ని సేకరించి భద్రపరచవచ్చు. ఇలా సేకరించిన చర్మాన్ని ఐదు సంవత్సరాల వరకు భద్రపరిచేందుకు వీలుందని వైద్యులు తెలిపారు.