వైకాపా ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని సీఎం జగన్ తరచూ చెబుతుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరగడం ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం అంటుంటారు. ఆంగ్లమాధ్యమం, అమ్మఒడి, గోరుముద్ద, నాడు-నేడు లాంటి కార్యక్రమాల వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని చెబుతుంటారు. ఆయన మాటలు ఇలా ఉంటే వాస్తవం మరోలా ఉంది. కరోనా సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక చాలామంది పేద, దిగువ మధ్యతరగతి వారు తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించారు.
అసర్-2021 సర్వే సైతం దీన్ని వెల్లడించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి కనిపించింది. కానీ విద్యార్థుల పెరుగుదలను తమ ఘనతగా సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రచారం చేశారు. నిజంగా అలాగే పెరిగితే... 2022-23లో 3.50లక్షల మంది ఎందుకు తగ్గారు? అంటే.. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం తగ్గిందా? అడ్డగోలు విలీనం బెడిసికొట్టిందా? విద్యార్థుల సంఖ్య తగ్గితే వివరాలను అందిస్తామని, ఎందుకు తగ్గారో విశ్లేషణ సైతం ఇస్తామని చెప్పిన మంత్రి దీనిపై మాట్లాడటమే మానేశారు. ప్రభుత్వం అసెంబ్లీలోనూ గతేడాది విద్యార్థుల సంఖ్యనే ఇచ్చింది. విద్యార్థులు పెరిగితే ఘనత అని చెప్పినవారు తగ్గితే ఎందుకు దాస్తున్నారో అర్థం కాని పరిస్థితి.
గత ప్రభుత్వంలో కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతులే మంత్రులుగా ఉండటంతో ఫీజులు నియంత్రించలేని పరిస్థితి ఉండేదని గతంలో సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇష్టానుసారం ఫీజులు పెంచుకునే అవకాశం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని గతంలో సీఎం జగన్ అన్నారు. కానీ అసలు వాస్తవం మరోలా ఉంది. విద్యాసంస్థలు ఉన్నవారినే సీఎం జగన్.. విద్యాశాఖ మంత్రులుగా నియమించారు. మొన్నటివరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ కుటుంబసభ్యులకు కర్నూలు, ఒంగోలులో శామ్యూల్ జార్జి పేరుతో డిగ్రీ, బీఈడీ, ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి.
ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణకు విజయనగరంలో సత్య, సీతం పేరుతో ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ ట్రస్టులో ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు. పాఠశాలలకు ఫీజులు నిర్ణయించే పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శిగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, ఇంజినీరింగ్ కళాశాల యజమాని సాంబశివారెడ్డిని నియమించారు. ఆయన ఉన్నత విద్యా కమిషన్‌లో సభ్యుడు కూడా. పాఠశాల కమిషన్ వైస్‌ఛైర్మన్ శారదారెడ్డికి ఉమ్మడి గుంటూరులో విద్యాసంస్థలు ఉన్నాయి. కార్యదర్శి, వైస్ ఛైర్మన్, సభ్యులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఛైర్మన్ జస్టిస్ కాంతారావు తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. పాఠశాల విద్యా కమిషన్‌ను ఏర్పాటుచేసి మూడేళ్లు గడిచినా ఇంతవరకూ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల ఫీజులను నియంత్రించలేదు. సరికదా గతంతో పోలిస్తే ప్రస్తుతం 50శాతానికిపైగా ఫీజులు పెరిగాయి కూడా.
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం ఎత్తేసి... పూర్తిగా ఆంగ్ల మీడియం ఏర్పాటు చేయడాన్ని సీఎం జగన్ గట్టిగా సమర్థించుకున్నారు. పిల్లలకు ఆంగ్లబోధన కోసం బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేస్తామని... ప్రతి బడిలో ఇంగ్లీష్ ల్యాబ్‌లు తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. మన పిల్లలు ప్రపంచ జాబ్‌మార్కెట్‌తో పోటీపడేలా చేయడానికి అడుగులు వేయాలా.. వద్దా అని ప్రశ్నించారు. ఆ మాటలు వినడానికి బాగానే ఉన్నాయి. కానీ వాస్తవంలో ఏం జరిగింది ఏమిటంటే.. ఉపాధ్యాయుల సామర్థ్యాలు, పిల్లల పరిస్థితులను పట్టించుకోకుండా ఒకేసారి 1 నుంచి 6తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చారు. ఇప్పుడు దీని ఫలితం కనిపిస్తోంది.