ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వలస కూలీకి సరిహద్దు కష్టం - migrants news

కేంద్రం వరమిచ్చినా వలస కూలీలకు కష్టాలు తప్పలేదు. లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీంతో తెలంగాణ నుంచి ఏపీ సహా ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు వలస కూలీలు, కార్మికులు వాహనాల్లో పెద్ద ఎత్తున బయల్దేరారు. అయితే, ఏపీ సరిహద్దుల్లో కృష్ణాజిల్లాలోని గరికపాడు, పశ్చిమగోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి చెక్‌ పోస్టుల వద్ద పోలీసులు వారిని నిలిపేశారు. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

The difficulties of migrants at border check posts
ఏపీ చెక్​పోస్టుల వద్ద వలస కూలీల ఇక్కట్లు

By

Published : May 4, 2020, 7:19 AM IST

వలస కూలీకి సరిహద్దు కష్టం

లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణాలో ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్‌ వలస కూలీలు, ఇతరులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సడలింపుతో స్వరాష్ట్రానికి బారులు తీరుతున్నారు. చెక్‌పోస్టుల వద్ద అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. జాతీయ రహదారిపై కృష్ణాజిల్లా గరికపాడు చెక్‌పోస్టు దగ్గరకు ఆదివారం ఉదయం నుంచి పెద్దసంఖ్యలో వలసకూలీలు చేరుకున్నారు. చాలా మందికి అనుమతి పత్రాలులేవు. దీంతో అధికారులు రాష్ట్రంలోకి అనుమతించలేదు. సూర్యాపేట కలెక్టర్‌ సహా పలువురు తెలంగాణ అధికారులు అనుమతుల విషయంలో వివరణ ఇవ్వడంతో పేర్లు, చిరునామా నమోదు చేసుకొని అనుమతిచ్చారు.

కడపలోని అమిన్‌పీర్‌ దర్గా తదితర ప్రార్థనా మందిరాల్లో ఉండిపోయిన రాజస్థాన్‌ ముస్లింలను ప్రభుత్వం ఇటీవల గుజరాత్‌ నుంచి మత్స్యకారులను తీసుకొచ్చిన బస్సుల్లో తరలించనున్నారు. వీరికి షేర్‌మహ్మద్‌పేట రిలాక్సేషన్‌ కేంద్రంలో ప్రస్తుతం బస ఏర్పాట్లు చేశారు. రాష్ట్రాల మధ్య రాకపోకలకు డీజీపీ అనుమతులు కావాల్సిందేనంటూ పోలీసులు పట్టుబట్టడంతో సామాన్య జనం ఆందోళనకు గురవుతున్నారు. ఆదివారం కర్నూలు సమీపంలోని పంచలింగాల వద్ద ఉన్న ఏపీ-తెలంగాణ సరిహద్దు చెక్‌ పోస్టులో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ నుంచి కర్నూలు మీదుగా కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లోని తమ జిల్లాలకు వెళ్లేందుకు పలువురు వాహనాల్లో వచ్చారు. కొందరు కలెక్టర్‌, ఎస్పీల నుంచి పాసులు తెచ్చుకోవడంతో కర్నూలు పోలీసులు అనుమతివ్వలేదు. దీనిపై ఇరువైపుల ఉన్నతాధికారులు మాట్లాడుకున్నా ప్రయోజనం లేకపోయింది. కర్నూలు పోలీసులు డీజీపీ పాసులున్న వాహనాలనే అనుమతించి మిగిలిన వారిని వెనక్కు పంపారు.

160 మంది వెనక్కి... పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లిలోని ఆంధ్రా-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద తెలంగాణ నుంచి వస్తున్న 160 మంది కూలీలను ఆదివారం పోలీసులు నిలిపేశారు. శ్రీకాకుళం, తుని, విజయనగరం, విశాఖపట్నానికి వెళ్తుండగా తెలంగాణ అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాలు సక్రమంగా లేవని అడ్డుకున్నారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అక్కడి అధికారులు మళ్లీ అనుమతి పత్రాలిచ్చినా ఆంధ్రాలోకి అనుమతించకుండా తిరిగి వెనక్కి పంపారు.

ఇవీ చదవండి...రాష్ట్రంలో లాక్​డౌన్​ అమలుకు కొత్త మార్గదర్శకాలివే..!

ABOUT THE AUTHOR

...view details