అమరావతిలో ఆందోళనలు ఏమాత్రం తగ్గలేదు. 34వ రోజు రైతులు, మహిళలు తమ నిరనస తెలియజేస్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. రాజధాని ఘోషతో ఇప్పటికే ఎంతోమంది చనిపోగా....మరో మహిళ తనువు చాలించింది. మూడు రోజుల కిందట రైతుల దీక్షలో పాల్గొన్న వేదవతి... శిబిరంలో సొమ్మసిల్లి పడిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మృతి చెందారు. నేలపాడులో రైతుల నిరసనలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం రాజధాని తరలించేందుకే నిర్ణయిస్తే ప్రాణత్యాగాలకు వెనకాడబోమంటూ రైతులు, ఉద్యోగస్థుల భవనాల పైకి ఎక్కారు. వారి కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. రైతులకు గ్రామస్థులు నచ్చజెప్పడంతో... కొద్దిసేపటి తర్వాత కిందకు దిగారు.
చలో అసెంబ్లీకి సిద్ధం..!
రాజధాని రైతులపై ప్రభుత్వ అణచివేత చర్యలు నియంతృత్వ పోకడలను ప్రతిబింబిస్తున్నాయని... తెలుగుదేశం నేత పరిటాల శ్రీరాం అన్నారు. రైతుల నిరసనలకు ఆయన సంఘీభావం తెలిపారు. రాజధాని ఉద్యమానికి సంపూర్ణ మద్దతివ్వాలని.... అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో బెజవాడ బార్ అసోసియేషన్ నిర్ణయించింది. ఇవాళ తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.