నలభై, యాభై ఏళ్ల క్రితం గంపెడు సంతానం ఉండటం గొప్ప.. రెండు మూడు దశాబ్దాల క్రితం అది ఇద్దరు, ముగ్గురు చాలనే దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఒక్కరే చాలు అనే దగ్గర ఆగిపోతోంది. దీనివల్ల కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ పాటిస్తున్నవారి సంఖ్య మరీ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. సగటున రాష్ట్రంలోని ప్రతి 10 కుటుంబాలకు పిల్లలు 17 మందే ఉంటున్నారు. ఈ సంఖ్య మరీ తగ్గకుండా చూడాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) చివరి రౌండ్ వివరాల ప్రకారం సంతానోత్పత్తి రేటు (టోటల్ ఫెర్టిలిటీ రేటు) 2.0గా ఉంది. 2015-16లో ఇది 2.2గా ఉండేది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 1.7గా రికార్డయింది. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే 1992-1993 లెక్కల ప్రకారం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 2.59గా ఉండేది. గత కొన్ని దశాబ్దాలుగా జనాభా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పథకాలు అమలు చేస్తోంది. సంతానం తగ్గింపునకు ముందుకొచ్చే వారికి ప్రోత్సాహకాలు ప్రకటించింది. వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించింది. 1992 నుంచి 1999 వరకు విస్తృత స్థాయిలో జరిగిన ప్రచారంవల్ల కుటుంబ నియంత్రణపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీనివల్ల సంతానం సంఖ్య క్రమంగా తగ్గింది. అయితే జనాభా పరిమితి ఇంతకుమించి తగ్గకుండా చూడటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే యువత సంఖ్య తగ్గిపోతుందని వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ నియంత్రణ చర్యలవల్ల 35 నుంచి 40 సంవత్సరాల వయసువారు తగ్గుతూ వస్తున్నారు. ఈ వయసువారు తగ్గడంతో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది.
మగధీరా.. కు.ని.కి వెనకేల!