కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగులో ఉంచిన సగం జీతాలు, పింఛన్‌ను డిసెంబరు, జనవరి నెలల్లో ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఉత్తర్వులు ఇచ్చారు. మార్చిలో మినహాయించిన జీతం, పింఛన్‌కు సంబంధించి ప్రస్తుత డిసెంబరులో, ఏప్రిల్‌లో మినహాయించిన జీతం మొత్తాలకు సంబంధించి 2021 జనవరిలో అనుబంధ బిల్లులుగా డీడీవోలు సమర్పించి ఖాతాలకు జమ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పింఛనుదారులకు డీఆర్ పెంపు
రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులకు పెండింగు కరవు సహాయం (డియర్‌నెస్ రిలీఫ్) 3.144 శాతం పెంచుతూ మంగళవారం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ ఉత్తర్వులు ఇచ్చారు. 2018 జులై ఒకటి నుంచి అమలయ్యేలా డీఆర్‌ను వర్తింపజేస్తూ జీవో విడుదల చేశారు. 2016, 2006 యూజీసీ పే స్కేలు కింద పింఛను పొందేవారికి, ఇతర పింఛనుదారులకూ డీఆర్ ఉత్తర్వులు వర్తించనున్నాయి. 2018 జులై 1 నుంచి 2020 డిసెంబరు 31 వరకు ఇవ్వాల్సిన బకాయిలను 2021 జనవరి నుంచి మూడు విడతల్లో చెల్లించాలని నిర్ణయించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అమరావతి ఏపీ ఐకాస ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ వైవీ రావు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
గుంటూరు జీజీహెచ్ రూపురేఖలను మార్చిన కరోనా