రాష్ట్రంలపై రోజురోజుకూ అప్పుల భారం పెరుగుతూనే ఉన్న విషయం.... కాగ్ తాజా లెక్కలతో మరోసారి నిరూపితమైంది. కరోనా వల్ల రెవెన్యూ ఆదాయం తగ్గిపోవటంతో ప్రారంభంలో అప్పులు తప్పలేదని చెబుతున్నా.... రెవెన్యూ రాబడి గత ఆర్థిక సంవత్సరం కన్నా ఇప్పుడు ఎక్కువేనని కాగ్ లెక్కలే అంటున్నాయి.
రాబడి పెరిగినా...అప్పులూ అధికమే
2019-20 ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకూ రెవెన్యూ రాబడి 85వేల987 కోట్లకుపైగా ఉంటే.... ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో అది 88వేల 238 కోట్లకుపైగా ఉంది. రుణాల విషయానికి వస్తే... కిందటి ఆర్థిక సంవత్సరం జనవరి నెలాఖరుకు 46వేల503 కోట్ల అప్పు చేస్తే.... ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో అది ఏకంగా 73వేల 912 కోట్లకుపైగా పెరిగింది. నాటి అప్పు అంచనాలతో పోలిస్తే 131 శాతం.... ప్రస్తుత సంవత్సర అంచనాల కన్నా 153 శాతం అధికంగా ఉంది. రాష్ట్రంలో జనవరి నెలాఖరు వరకూ రెవెన్యూ ఖర్చు, పెట్టుబడి వ్యయం కలిపి లక్షా 61వేల 833 కోట్లు వెచ్చించారు. 100 రూపాయలు ఖర్చు చేస్తే అందులో 45 రూపాయలు అప్పుల రూపంలోనే సమకూర్చుకోవాల్సి వచ్చింది. మిగిలినది రెవెన్యూ రాబడి.
గుదిబండగా రెవెన్యూ లోటు
ఈ ఏడాది రెవెన్యూ లోటు గుదిబండలా మారుతోంది. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు తగ్గించుకుంటూ వస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా... పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. ఈ ఏడాది 54వేల 46 కోట్ల రూపాయల మేర రెవెన్యూ లోటు ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల మేరకు దాన్ని 18వేల434 కోట్లకే పరిమితం చేస్తామని ఆర్థికశాఖ వాగ్దానం చేసింది. కిందటి ఏడాది అది 34వేల690 కోట్లు మాత్రమే..!