పోలవరం నిధులపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారని మంత్రి వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... విభజన చట్టం మేరకు పోలవరం ఖర్చు పూర్తిగా కేంద్రమే భరించాలని అన్నారు. 2014 నాటికి రాష్ట్రం చేసిన ఖర్చు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. వంద శాతం ఇరిగేషన్ కాంపోనెంట్‌ను 2014 ధరల ప్రకారం చెల్లిస్తామన్నారని వెల్లడించారు.
ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత రాష్ట్రానికి అప్పగిస్తున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. పీపీఏ 6 భేటీలు నిర్వహించి సవరించిన అంచనాలు కోరినా గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు?. ఓ కీలకమైన ప్రాజెక్టు కు సంబంధించిన వాస్తవాలు ఎందుకు దాచిపెట్టారు?. పరిశ్రమలకు నీళ్లు, పవర్ హౌస్ కుకూడా నిధులు కోల్పోవాల్సి వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్నే ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా డిసెంబర్ 2021కి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస పరిహారాన్ని కూడా పూర్తి చేస్తాం. ప్రస్తుతం ఇంకా లక్ష నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసం చెల్లించాల్సి ఉంది- అనిల్ కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి