మామిడి సాగు చేసే రైతులకు వరుసగా రెండో ఏడాది కరోనా కాటు తప్పలేదు. గత ఏడాది ఆశించిన స్థాయిలో పంట దిగుబడి వచ్చినా.. సీజను ఆరంభం నుంచి కరోనా ఆంక్షలు ఎదురవడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ ఏడాది ఆరంభంలో పరిస్థితి మెరుగవుతుందని తొలుత ఆశించారు. దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉండటంతో రైతులు కొంత ఉపశమనం పొందారు. ఆరంభంలో ఎగుమతులు వేగవంతమయ్యాయి. గతం స్థాయిలో కాకున్నా, కొంతమేరకు గిట్టుబాటు ధరకు కొనుగోళ్లు జరిగాయి. బంగినపల్లి రకం మామిడికి టన్నుకు రూ.80 వేల ధర లభించింది.
తోతాపురి రకం టన్ను రూ.30 వేల గరిష్ఠ ధరకు కొనుగోలు చేశారు. ఇతర ప్రాంతాల్లో కరోనా కారణంగా వచ్చిన మార్పులు, ఆంక్షలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు సన్నగిల్లుతున్న ఎగుమతుల దృష్ట్యా ధరలు సైతం దిగజారాయి. బంగినపల్లి మామిడిని టన్ను రూ.30 వేలకు మించి కొనుగోలు చేయని పరిస్థితి తలెత్తింది. స్థానికంగా విక్రయావకాశాలున్న తోతాపురి రకం మామిడి టన్ను రూ.15 వేల వద్ద స్థిరంగా నిలిచింది. తాజాగా ఆంక్షలు మరింత కఠినం చేసి, రాష్ట్రంలో సైతం కర్ఫ్యూ పెట్టడంతో అన్నదాతలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.