cinema tickets issue in AP: సినిమా టికెట్ ధరలు, థియేటర్ల వర్గీకరణ తదితర అంశాలపై మరోమారు భేటీ కావాలని ప్రభుత్వ కమిటీ నిర్ణయించింది. 2022 జనవరి 11 తేదీన మరోమారు సమావేశమై సమగ్రంగా చర్చించాలని అభిప్రాయపడింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ వర్చువల్ గా సమావేశమై వివిధ అంశాలను చర్చించింది. సినిమా టికెట్ ధరలను ఎలా నిర్ణయించాలన్న అంశాలపై మరింతగా అధ్యయనం అవసరమని కమిటీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
సినిమా థియేటర్లలోకి అనుమతించేందుకు టికెట్ ధరల ఖరారు లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల వర్గీకరణ, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సినీ గోయర్లు, ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం సినిమా టికెట్ ధరల్ని తగ్గించటం ప్రజలు స్వాగతిస్తున్నారని సినీ గోయర్ల అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. అయితే.. దీనిపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినట్టు సమాచారం. ప్రభుత్వ తరపున వర్చువల్ సమావేశంలో హాజరైన ప్రతినిధులు ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకోవాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.