కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు నిమిత్తం కేంద్రం ఇస్తున్న నిధులను ఇక ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయడానికి వీల్లేదు. ఆ నిధులను వేరే ఖాతాలకు, పీడీ ఖాతాలకు మళ్లించడం కుదరదు. కేంద్రం ఏ పథకాలకు ఇస్తే వాటికే ఖర్చుచేయాలి. కేంద్రం నుంచి వచ్చే నిధులను తొలుత వేరే అవసరాలకు వినియోగించుకుని, పీడీ ఖాతాలకు మళ్లించి తర్వాతి ఏడాది ఖర్చుచేయడం ఇకపై కుదరదు. కేంద్రం ఇచ్చిన వాటా నిధులు ఖర్చుచేసి ఆ పథకంలో రాష్ట్ర వాటా తర్వాత చెల్లిస్తామన్నా కుదరదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిధుల వినియోగ విధానాన్ని సమూలంగా మార్చేసింది. గతేడాది నుంచి అనేక ప్రతిపాదనలతో ప్రయత్నాలు ప్రారంభించినా కొత్త మార్గదర్శకాలు ఈ మధ్యే కొలిక్కి వచ్చాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ విషయం చర్చించాక ఈ మార్గదర్శకాలను కేంద్రం ఖరారు చేసింది. కొత్త విధానాల ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక, ఇతరత్రా ఏర్పాట్లు చేసి తమకు తెలియజేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాల వల్ల తమ పథకాల అమలు తీరు సరిగా లేదని కేంద్రం భావిస్తోంది. తొలుత రాష్ట్రాలు తమ అవసరాలకు నిధులు వాడుకుని, తర్వాత కేంద్ర పథకాలపై దృష్టి సారిస్తున్నాయనే విమర్శా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర పథకాల సక్రమ అమలుకు, పారదర్శకంగా ఖర్చు చేయడానికి, లబ్ధిదారులకు అంతిమ ప్రయోజనం సరిగా అందేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు
చేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది.
సంసిద్ధం కాని రాష్ట్ర ప్రభుత్వం
ఈ కొత్త విధానాన్ని జులై నుంచి ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ఇందుకు 20 రాష్ట్రాలు సానుకూలత వ్యక్తం చేయగా... ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంకా సరేననలేదు. కొత్త విధానంతో ఆర్థిక నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయని, ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు వినియోగించుకుంటున్న కేంద్ర నిధులను ఇకముందు అలా ఖర్చుచేసే పరిస్థితులు ఉండవని రాష్ట్ర ఆర్థికశాఖలోనే చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త విధానం అమలుచేసేలా ఎనిమిది అంశాల్లో ఏర్పాట్లు చేసి తమకు తెలియజేయాలని కేంద్రం కోరింది. ఆర్థికశాఖ అధికారులు బ్యాంకులతో ఇప్పటికే సమావేశం ఏర్పాటుచేసినా చాలా విషయాలు కొలిక్కి రాలేదని సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 9 పథకాలకు నిధులు ఇలా వినియోగించాలి.