ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Union budget 2022: పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌... ఆంధ్రా ఆశలు ఫలించేనా? - బడ్జెట్‌ 2022

Union budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ఉదయం పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే.. ఈ బడ్జెట్‌లో రాష్ట్రంలో దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న ప్రాజెక్టులకు నిధులు ప్రకటిస్తుందా?, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు పూచీ పడుతుందా? అని రాష్ట్ర ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

By

Published : Feb 1, 2022, 7:43 AM IST

Union budget 2022: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంటుకు సమర్పించనున్న కేంద్ర బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆశలు తీరుస్తుందా? రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు పూచీ పడుతుందా? అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తుందా? దీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న ప్రాజెక్టులకు నిధులు ప్రకటిస్తుందా? అని రాష్ట్ర ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

పోలవరమే కీలకం
పునర్విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున కేంద్రమే నిధులిస్తోంది. సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు పెట్టుబడి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. 2022-23లో రూ.10,900 కోట్లు అవసరమని అధికారులు నివేదించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పోలవరానికి కేంద్రం రీఇంబర్స్‌ చేసిన నిధులు కేవలం రూ.1,070 కోట్లు మాత్రమే. రూ.333 కోట్లు, రూ.417 కోట్లు, రూ.320 కోట్లు చొప్పున మూడు విడతల్లో ఈ మొత్తాన్ని సమకూర్చింది. ఈ తరుణంలో ఈ ఏడాది కేటాయించే నిధులే ప్రాజెక్టు నిర్మాణంలో వేగాన్ని నిర్దేశిస్తాయనడంలో సందేహం లేదు.

రెవెన్యూ లోటు భర్తీ చేసేనా?
రాష్ట్ర విభజన సమయంలోనే రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని నాటి యూపీయే ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాస్తవానికి 2014-15 నాటి రెవెన్యూ లోటు భర్తీ నిధులు ఇప్పటికీ రాలేదు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నవాదనలు విన్పిస్తున్నాయి. అయినా, రాష్ట్ర అధికారులు కేంద్రాన్ని అభ్యర్థిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం రూ.18,830.37 కోట్లు అవసరమని అడుగుతున్నారు.

మౌలిక వసతుల ప్రాజెక్టుల మాటేమిటో?
పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన కేంద్ర సంస్థల్లో చాలావరకు ఇంకా నెలకొల్పలేదు. ఏర్పాటు చేసిన వాటికీ అవసరం మేరకు నిధులు ఇవ్వలేదు. కొన్నింటికి అనుమతులే రాలేదు. రాష్ట్రం వీటిన్నింటినీ కేంద్రం వద్ద ప్రస్తావించింది. ముఖ్యంగా విశాఖపట్నం సమీపంలో భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి అనుమతులు ఇవ్వాలని, ఆర్థిక సాయం అందించాలని రాష్ట్రం కోరుతోంది. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ పేరిట మైనింగ్‌ లీజులు రిజర్వు చేసి, నిధులివ్వాలని ఆశిస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 7 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తామన్న కేంద్రం హామీని మరోసారి గుర్తుచేస్తోంది. గత ఐదేళ్లుగా ఈ నిధులు రావడం లేదు. వీటికి దాదాపు రూ.23 వేల కోట్ల వరకు రావాల్సి ఉంది.

ఇదీ చదవండి

నేడే కేంద్ర పద్దు.. ఊరటనిస్తారా.. ఉసూరుమనిపిస్తారా.!

ABOUT THE AUTHOR

...view details