good governance ranks :2020-21 సంవత్సరానికిగాను గుడ్ గవర్నెన్స్ సూచీని కేంద్రం విడుదల చేసింది. మొత్తం పది రంగాల్లో గుడ్ గవర్నెన్స్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ సూచీలో గుజరాత్, మహారాష్ట్ర తొలి రెండు స్థానాలు పొందగా.. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 9, 10 స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రథమ స్థానం దక్కింది. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వాలకు కేంద్రం ఏటా ఈ ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది.
సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని 2020-21 సంవత్సరానికి సంబంధించి ప్రజా ఫిర్యాదులు, పరిపాలన సంస్కరణలశాఖ రూపొందించిన సుపరిపాలన సూచీని(జీజీఐ) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శనివారం విడుదల చేశారు. ప్రభుత్వ పాలనలోని 10 రంగాల్లో 58 సూచికల ఆధారంగా ర్యాంకింగ్‌ను నిర్ణయించారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను 4 విభాగాలుగా విభజించారు. గ్రూప్-ఎలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, గుజరాత్, హరియాణా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు ఉన్నాయి. గ్రూప్-ఎలో గుజరాత్.., గ్రూప్-బిలో మధ్యప్రదేశ్, ఈశాన్య, పర్వత రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిల్లీ ప్రథమ స్థానాల్లో నిలిచాయి.