సెనగలకు మద్దతు ధర క్వింటాలుకు రూ.130 పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో క్వింటాలు ధర రూ.5,230 అవుతుంది. రాష్ట్రంలో ఎకరాకు సగటు దిగుబడి నాలుగు క్వింటాళ్ల ప్రకారం చూస్తే.. రైతుకు లభించేది రూ.21వేలు మాత్రమే. ఎకరా కౌలు ధరలే రూ.15వేలు పైబడిన పరిస్థితుల్లో.. రైతుకు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం కష్టమే. మద్దతు ధర పెంచుతున్నట్లు ఘనంగా ప్రకటించినా.. కొనుగోలు చేసేది నామమాత్రమే. మొత్తం ఉత్పత్తిలో 25% కూడా కొనుగోలుకు నోచుకోవడం లేదు. వచ్చే రబీకి సంబంధించి కేంద్రం బుధవారం మద్దతు ధరలు ప్రకటించింది. ఇందులో సెనగ పంటను రాష్ట్రంలో 11 లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తారు. రబీలో వరి తర్వాత సాగయ్యే ప్రధాన పంట ఇదే. కర్నూలు, కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో అధికంగా సాగు చేస్తారు.
రూ.12వేల పెట్టుబడితో.. ఎకరా సాగు సాధ్యమా?
సేద్యం, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కౌలు, నూర్పిడి, పెట్టుబడిపై వడ్డీ, కుటుంబ శ్రమ అన్నీ కలిపితే సెనగల సగటు ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.3,004 చొప్పున అవుతుందని కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో గత అయిదేళ్లలో వచ్చిన దిగుబడుల్ని చూస్తే సగటున ఏడాదికి 4 క్వింటాళ్లు మాత్రమే. అంటే కేంద్రం లెక్కలో ఎకరాకు మొత్తం అయ్యే పెట్టుబడి రూ.12,016. వాస్తవానికి సెనగ సాగుకు ఎకరాకు రూ.25వేల నుంచి రూ.40వేల వరకు అవుతోంది. ఎకరా కౌలు రూ.10వేల నుంచి రూ.15వేల మధ్య ఉంది. నల్లరేగడి నేలలు అయితే రూ.18 వేల చొప్పున కౌలుకు తీసుకుంటున్నారు. ఎకరానికి అర క్వింటాలు చొప్పున విత్తనాలకే రూ.5వేల వరకు అవుతున్నాయి. కూలీ ఖర్చులు, ఎరువులు, పురుగుమందుల ధరలూ పెరిగాయి. ఎకరా నూర్పిడికి రూ.3వేల వరకు అవుతుంది.