ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధానిపై రాష్ట్రానిదే ఫైనల్.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్

central on three capitals
హైకోర్టులో కేంద్రం అఫిడవిట్

By

Published : Sep 10, 2020, 11:20 AM IST

Updated : Sep 11, 2020, 7:17 AM IST

11:16 September 10

రాజధానుల్లో కేంద్రం పాత్రపై మరింత స్పష్టత ఇచ్చిన హోంశాఖ

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు (ప్రిన్సిపల్‌ సీట్)ను అమరావతిలో ఏర్పాటుచేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను నోటిఫై చేసినంత మాత్రాన.. అమరావతిని ఏపీ రాజధానిగా తాము ప్రకటించినట్లు భావించడానికి వీల్లేదని కేంద్రం తెలిపింది. హైకోర్టు ప్రిన్సిపల్‌ బెంచ్‌ రాష్ట్ర రాజధానిలో తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదంది. రాజ్యాంగ అధికరణ 3లో కొత్త రాష్ట్రాల ఏర్పాటు నిబంధన మాత్రమే ఉందని, రాజధాని ఏర్పాటు గురించి లేదని తెలిపింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్‌ 6, 94(3)(4), పదమూడో షెడ్యూల్లో ‘ఏ క్యాపిటల్‌ ఫర్‌ ది స్టేట్ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని పేర్కొన్నందున.. రాష్ట్రానికి ‘ఒక’ రాజధాని మాత్రమే ఉండాలని పిటిషనర్లు పేర్కొన్నారని తెలిపింది. జనరల్‌ క్లాజ్‌ చట్టం-1897 సెక్షన్‌ 13 ప్రకారం కేంద్ర చట్టాలు, నిబంధనల్లో ‘ఏకవచనాన్ని’ ‘బహువచనం’గా, బహువచనాన్ని ఏకవచనంగా అన్వయించుకోవచ్చని స్పష్టంచేసింది. పుంలింగాన్ని.. స్త్రీలింగంగానూ పరిగణనలోకి తీసుకోవచ్చంది. ఈ నేపథ్యంలో పిటిషనర్ల వాదనకు అర్థం లేదని తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని సవాలు చేస్తూ అమరావతి రాజధాని ప్రాంత రైతులు డి.సాంబశివరావు, టి.శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గతంలో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్‌కు పిటిషనర్లు/రైతులు సమాధానంగా కౌంటర్‌ వేశారు. దానికి బదులిస్తూ కేంద్ర హోంశాఖ అండర్‌ సెక్రటరీ లలిత టి.హెడావు తాజాగా అదనపు అఫిడవిట్ వేశారు.

  • అందులోని వివరాలు ఇలా..

 ‘పిటిషనర్లు వేసిన కౌంటర్లో కేంద్రంపై పేర్కొన్న అభ్యంతరకర అంశాలు ఖండించదగినవి. ఏపీ కొత్త రాజధానికి మౌలిక సదుపాయాల కోసం కేంద్రం ఆర్థికసాయం చేయాలని, క్షీణించిన అటవీ భూములు రాజధానికి అవసరమైతే నోటిఫై చేయాలని విభజన చట్టం సెక్షన్‌ 94(3)(4) స్పష్టంచేస్తోంది. ఏపీ ఎంపిక చేసిన రాజధానికి కేంద్రం అందించే ఆర్థిక సాయం గురించి చట్ట నిబంధనలు చెబుతున్నాయి. అంతే తప్ప కేంద్రం రాజధానిని నిర్ణయించడం గురించి చెప్పడం లేదు. గత ఏపీ ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసింది. 2015 ఏప్రిల్‌ 23న జీవో ఇస్తూ అమరావతిని రాజధానిగా నోటిఫై చేసింది. ఆ నోటిఫికేషన్‌ ఆధారంగా సర్వే ఆఫ్‌ ఇండియా.. ఏపీ రాజధాని అమరావతిగా భారత రాజకీయ చిత్రపటంలో తాజాగా పొందుపరిచింది. విభజనచట్టం సెక్షన్‌ 5 ప్రకారం.. రాష్ట్రాల అవతరణ దినం నుంచి పదేళ్లకు మించకుండా హైదరాబాద్‌ ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధాని. ఆ తర్వాత హైదరాబాద్‌ తెలంగాణ రాజధాని అవుతుంది. ఏపీకి కొత్త రాజధాని ఉంటుంది. ఈ విషయమై చట్టంలో స్పష్టత ఉంది. అయినా ఉమ్మడి రాజధాని నుంచి తరలివెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విభజన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాది తర్వాత రాజధానిని 23 ఏప్రిల్‌ 2015న నోటిఫై చేసింది. అధికరణ 214, విభజన చట్టంలోని సెక్షన్లు 30, 31 నిబంధనలకు అనుగుణంగా 2019 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్‌ అమరావతిలో ఉంటుందని పేర్కొంటూ 2018 డిసెంబర్‌ 16న రాష్ట్రపతి ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. దానిని కేంద్రం నోటిఫై చేసింది. హైకోర్టు ప్రధాన బెంచ్‌ అమరావతిలో ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులను కేంద్రం నోటిఫై చేసినంత మాత్రాన.. అమరావతిని ఏపీ రాజధానిగా కేంద్రం ప్రకటించినట్లు భావించడానికి వీల్లేదు’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అంతర్వేది దేవస్థానానికి ప్రత్యేక అధికారి నియామకం

Last Updated : Sep 11, 2020, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details