రాష్ట్రానికి వచ్చిన కొవిడ్ టీకాను అర్హులకు వేయడంలో 'కొవిన్' యాప్ కీలకం. ఇప్పటివరకు మూడుసార్లు నిర్వహించిన 'డ్రై రన్' ద్వారా ఈ యాప్ వేగం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టీకా పొందే వారి సెల్‌ఫోన్లకు సంక్షిప్త సమాచారం వస్తుంది. ఏ కేంద్రానికి, ఎప్పుడు రావాలో అందులో ఉంటుంది. దీని ప్రకారమే కేంద్రాలకు రావాలి. అయితే, కరోనా టీకా వేయించుకునేవారి సెల్‌ఫోన్ నంబర్లు ఆధార్‌తో అనుసంధానం కావడం తప్పనిసరి.
టీకా ఒకరికి బదులు మరొకరికి వేయకుండా చూసేందుకే ఈ విధానాన్ని పాటిస్తున్నారు. ఆధార్ కార్డుకు అనుసంధానమైన సెల్‌ఫోన్ నంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేశాకే ఇతర వివరాలు నమోదయ్యేలా యాప్ రూపొందించారు. చాలామందికి ఆధార్ కార్డులున్నా వాటికి సెల్‌ఫోన్ నంబరు అనుసంధానం కాలేదు. అలాంటివారికి ఓటీపీ రాదు. దీనిపై అవగాహన ఉన్నవారు ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకు సెల్‌ఫోన్ నంబరును అనుసంధానం చేయించుకుంటున్నారు.