ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'హైకోర్టు సీజే బెంచ్​కు ప్రకటనల వ్యాజ్యం బదిలీ' - advertisements in newspapers

ప్రకటనలు జారీ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంభిస్తోందంటూ దాఖలైన పిల్‌ను...హైకోర్టు ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌కు బదిలీ చేసింది. జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలకు ప్రకటనలిచ్చే విషయంలో....... అనుకూల ధోరణి, బంధుప్రీతి ప్రదర్శిస్తోందంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ వ్యాజ్యం న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవితో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. అయితే పిల్‌ను సీజే బెంచ్‌కు బదిలీ చేసిన ధర్మాసనం.... ఈ వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తికి నివేదించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.

chief-justice-of-ap-bench
chief-justice-of-ap-bench

By

Published : Sep 1, 2020, 4:51 AM IST

ముఖ్యమంత్రి జగన్‌ సతీమణి భారతీరెడ్డి డైరెక్టర్‌గా వ్యవహరించిన జగతి పబ్లికేషన్స్‌, ఇందిరా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలకు...... ప్రకటనలు ఇవ్వటంలో ప్రభుత్వం అనుకూల ధోరణి, బంధుప్రీతి ప్రదర్శిస్తోందని విజయవాడకు చెందిన నాగశ్రవణ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం ప్రకటనలు జారీ చేస్తోందని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించారు. పక్షపాత వైఖరి అవలంభించడంతో పాటు వైకాపా రంగుల కలయికతో ప్రకటనలు ఇస్తోందన్నారు.

ఉల్లంఘిస్తున్నారు...

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన అయినందున అక్కడ ఫిర్యాదు చేయాలని ధర్మాసనం సూచించింది. పిటిషనర్‌ తరపు న్యాయవాది బదులిస్తూ... ఆ తీర్పును చట్టంగా భావించాలని, దానిని అన్ని రాష్ట్రాలు పాటించాలని సుప్రీం స్పష్టం చేసిందన్నారు. ఇష్టం ఉన్న మీడియాను ప్రోత్సహించడం, లేనివాటిని పట్టించుకోకపోవడం సరికాదని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. పిల్‌ దాఖలు చేసిన మీరెవరు అని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. ప్రజా చైతన్యం కలిగిన వ్యక్తిగా దాఖలు చేసినట్లు న్యాయవాది శ్రవణ్‌ బదులిచ్చారు. ఏ నిబంధనల ప్రకారం పక్షపాత ధోరణో చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి పిటిషనర్‌ బదులిస్తూ ... సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. అందులోని వివరాల్ని చదివి వినిపించారు. ఈ వ్యవహారంలో హైకోర్టు ఏవిధంగా దర్యాప్తునకు ఆదేశిస్తుందని ధర్మాసనం అడగగా.... దర్యాప్తు అవసరం లేదని పిటిషనర్‌ వివరించారు. సహ చట్టం ద్వారా పొందిన వివరాల ప్రకారం సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు స్పష్టం అవుతోందన్నారు. ఈ వాదనలపై జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ స్పందిస్తూ ... సీఎం సహా ఇతరుల ఫొటోలు ప్రకటనలో ప్రచురించడానికి తాను వ్యక్తిగతంగా వ్యతిరేకం అన్నారు.

సీజే ధర్మాసనం ముందుకు...

ముఖ్యమంత్రి ఫొటో ప్రచురణకు పిటిషనర్‌ వ్యతిరేకం కాదని దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి చెందిన దివంగతులైన ఆయన తండ్రి ఫొటోను ప్రకటనల్లో వాడుతున్నారన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తండ్రి ఫొటో వాడటానికి వీల్లేదన్నారు. రాజకీయ పార్టీ జెండా రంగులు, ముఖ్యమంత్రి తండ్రి ఫొటోను వినియోగించిన ప్రకటననూ పరిశీలించాలన్నారు. ముఖ్యమంత్రి తండ్రి కూడా ముఖ్యమంత్రే కదా అని వ్యాఖ్యానించిన ధర్మాసనం..... రాజకీయ పార్టీల రంగుల విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది. సుప్రీం కేవలం సీఎం ఫొటో మాత్రమే వాడాలని సూచించిందని న్యాయవాది బదులిచ్చారు. భవనాలకు రంగులేసే విషయంలోనే హైకోర్టు తీర్పు ఇచ్చిందని... ప్రకటనల విషయంలో కాదన్నారు. ఈ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... సీజే ధర్మాసనం ముందు వ్యాజ్యంపై విచారణ జరగడం సబబంటూ ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

రాజకీయ ప్రయోజన వ్యాజ్యం: ఏజీ
అంతకు ముందు..... పిల్‌ దాఖలు చేయడం వెనుక సదుద్దేశం లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదించారు. ఇది రాజకీయ ప్రయోజన వ్యాజ్యమన్నారు. పసుపు రంగుతో గత సీఎం ఫొటోను ప్రచురించిన ప్రకటనను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మంత్రులు, క్యాబినెట్‌ మంత్రుల ఫొటోల ప్రచురణకు సుప్రీం అనుమతిచ్చిందన్నారు. గత ప్రకటనలనూ సమర్థించడం లేదని జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ బదులిచ్చారు. మంత్రుల ఫొటోలు మళ్లీ మళ్లీ ప్రచురించడం సరికాదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలకు తెలియజేసేలా ప్రకటనలు ఉండాలన్నారు. ఫొటోలను ప్రచురించాల్సిన అవసరం లేదన్నారు. మంత్రులు సినిమాల్లో కథానాయకులు కాదు కదా అని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ అస్తమయం

ABOUT THE AUTHOR

...view details