పంచాయతీ ఎన్నికల్లో సుమారు 3.6 లక్షల మంది యువతకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతోందని... ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన విద్యార్థిని అఖిల దాఖలు చేసిన వ్యాజ్యంపై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరఫున న్యాయవాది శివప్రసాద్ రెడ్డి... హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులును అభ్యర్ధించగా... ఈ వ్యాజ్యంపై ఇవాళ విచారణ జరుపుతామని న్యాయమూర్తి బదులిచ్చారు.
2019 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తే 3.6 లక్షల మంది 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కును కోల్పోతారన్నారని పిటిషన్‌లో అఖిల పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ నెల 23 న ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసేలా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరారు.