మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న నిరసనలు ఈ రోజుతో 500వ రోజుకు చేరనున్నాయి. రాజధాని అమరావతి ఐకాస ‘అమరావతి ఉద్యమ భేరి’ పేరుతో వర్చువల్ విధానంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ సభ నిర్వహించనుంది. లక్షమంది పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ సభను నిర్వహించనున్నట్లు ఐకాస ప్రతినిధులు తెలిపారు.
రాజధాని ప్రాంతాల్లోని దీక్షా శిబిరాల నుంచి భౌతిక దూరం పాటిస్తూ రైతులు సభలో పాల్గొనేలా శిబిరాల్లో ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నారు. మరికొందరు ఇళ్లలోనే సెల్‌ఫోన్, కంప్యూటర్ నుంచి అనుసంధానమై పాల్గొనేలా అవగాహన కల్పించారు. వివిధ పార్టీల జాతీయ నాయకులు, న్యాయమూర్తులు, దళిత, బహుజన, ప్రజా, వ్యాపార, వాణిజ్య సంఘాల నేతలు హాజరు కానున్నారు. http://bit.ly/SaveAmaravati అనే యూట్యూబ్ లింక్ ద్వారా రాష్ట్ర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అమరావతి రైతుల నిరసనలు గురువారం 499వ రోజు కొనసాగాయి. ఉద్యమం 500వ రోజుకు చేరుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాయపూడిలో శుక్రవారం ఉదయం 9 గంటలకు అమరావతి దళిత చైతన్య గీతాన్ని ఆవిష్కరించనున్నట్లు దళిత ఐకాస అమరావతి కో కన్వీనర్ చిలకా బసవయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి ఉద్యమ ఐకాస నేతలు పాల్గొంటారని వెల్లడించారు.