తెలంగాణలోని జూపార్కులు, జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఫలితంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ తిరిగి తెరచుకుంది. ఉదయం 8.30 గంటలకు అధికారులు జూ పార్క్‌ను పునఃప్రారంభించారు. కొవిడ్ కారణంగా నెలల తరబడి ఇళ్లలోనే గడిపిన నగర ప్రజలు సేదతీరేందుకు జూకు క్యూ కట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి పార్కులో ఆహ్లాదంగా గడిపారు. మధ్యాహ్నం వరకు సుమారు 1,100 మంది పర్యాటకులు జూను సందర్శించారు.
సందర్శకులకు మార్గదర్శకాలు..
ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే అధికారులు పర్యాటకులను లోనికి అనుమతిస్తున్నారు. టికెట్ కౌంటర్ వద్ద భౌతిక దూరం పాటించేలా వృత్తాలు ఏర్పాటు చేశారు. జలుబు లేదా జ్వరం ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించడం లేదు. పది సంవత్సరాల లోపు చిన్నారులతో పాటు 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఆదివారాలు, సెలవు దినాల్లో జూ సందర్శనకు రాకపోవడం మంచిదని అధికారులు సూచించారు. జంతు ప్రదర్శన శాలలో సఫారీ పార్క్, సర్పాల గృహం, అక్వేరియం, ఫాజిల్ మ్యూజియం, నాచురల్ హిస్టరీ మ్యూజియం మూసివేసినట్లు వెల్లడించారు. ప్రవేశ ద్వారం వద్ద రసాయన మ్యాట్లను ఏర్పాటు చేశామన్నారు.