SSC Paper Leakage Case: పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ ఆరోపణలతో కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడు కె పునీత్తోపాటు మరి కొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ వ్యాజ్యాల్లో తగిన ఆదేశాల జారీ నిమిత్తం విచారణ గురువారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. మన్మథరావు ఈమేరకు ఆదేశాలిచ్చారు.
విచారణ సందర్భంగా.. పిటిషనర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. మాల్ ప్రాక్టీసుతో పిటిషనర్లకు సంబంధంలేదన్నారు. నారాయణ విద్యా సంస్థలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న కారణంగా పిటిషనర్లను అరెస్ట్ చేసే ప్రమాదం ఉందన్నారు. పబ్లిక్ పరీక్షల చట్టం కింద కేసు నమోదు చేసినప్పుడు ఐపీసీ సెక్షన్లు పెట్టడానికి వీల్లేదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు నిబంధనలను పోలీసులు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.