ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్ణాటక కొత్త జలాశయానికి ఏపీ ససేమిరా - Karnataka proposal to build a balancing reservoir above Tungabhadra news

తుంగభద్రకు ఎగువన బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి కర్ణాటక ప్రతిపాదనపై.... రాష్ట్ర జలవనరులశాఖ అభ్యంతరం వ్యక్తంచేసింది. రిజర్వాయర్‌ నిర్మాణంపై ముందుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుదన్నారు. ఆ తర్వాతే ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని స్పష్టంచేయగా.... ఈ వాదనతో కర్ణాటక విభేదించింది.

Karnataka new reservior
కర్ణాటక కొత్త జలాశయానికి ఏపీ ససేమిరా

By

Published : Oct 23, 2020, 7:38 AM IST

తుంగభద్ర జలాశయానికి ఎగువన నవళి వద్ద బ్యాలెన్సింగ్‌ జలాశయం నిర్మాణానికి కర్ణాటక రాష్ట్రం చేసిన ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ముందు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో రాజకీయ ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే ఈ ప్రతిపాదన ముందుకు తీసుకువెళ్లాలని, అంతవరకూ తాము చేయగలిగేదీ ఏమీ లేదని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు స్పష్టంచేశారు. బోర్డు ఛైర్మన్‌ రంగారెడ్డి అధ్యక్షతన గురువారం వీడియో కాన్ఫరెన్సు విధానంలో తుంగభద్ర బోర్డు సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఈ సమావేశంలో పాల్గొని నవళి జలాశయం నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తుంగభద్ర ప్రాజెక్టులో పూడిక పెరిగిపోవడంతో మూడు రాష్ట్రాలకు కేటాయించిన నీటిని వాడుకోలేకపోతున్నామని కర్ణాటక పేర్కొంటూ బ్యాలెన్సింగ్‌ జలాశయం నిర్మిస్తామని ప్రతిపాదన తీసుకొచ్చింది. పూడిక పెరగడం వల్ల అసలు నష్టపోతున్నది తామేనని ఏపీ వాదించింది. రాజకీయ అభిప్రాయం ముఖ్యమని ఈఎన్‌సీ చెప్పగా కర్ణాటక అధికారులు తొలుత సాంకేతిక అంశాలు చర్చించి అధికారుల స్థాయిలో ఏకాభిప్రాయం సాధిస్తే ఆనక రాజకీయ నిర్ణయం తీసుకుంటారని చెప్పగా ఏపీ అధికారులు విభేదించారు.

హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హెచ్చెల్సీకి సమాంతరంగా వరద కాలువ నిర్మించి 20 రోజుల్లో 25 టీఎంసీలు మళ్లించి రెండు రాష్ట్రాలు ఉపయోగించుకునేలా ఒక ప్రతిపాదన బోర్డు ముందుంచింది. దీన్ని కర్ణాటక అధికారులు వ్యతిరేకించారు. బోర్డు ఛైర్మన్‌ రంగారెడ్డి మాట్లాడుతూ ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. తుంగభధ్ర బోర్డు పరిధిలో చేపడుతున్న పనులకూ రివర్స్‌ టెండర్లు చేపట్టాలని కొందరు చేసిన సూచనను బోర్డు సమావేశం ముందుంచింది. ముందు నాణ్యత ముఖ్యమని, ఆ విషయంలో రాజీ పడవద్దని కర్ణాటక అధికారులు పేర్కొన్నారు. రివర్స్‌ టెండర్లకు ఏపీలో మంచి స్పందన వచ్చిందని ఇక్కడి అధికారులు చెప్పడంతో బోర్డు పరిధిలో పనులకూ రివర్స్‌ టెండర్ల విధానం చేపట్టేందుకు బోర్డు సభ్యులంతా ఆమోదించారు. నవంబరు 20 నుంచి జరగనున్న తుంగభద్ర పుష్కరాలకు 8 టీఎంసీలు నీళ్లు కావాలని ఏపీ బోర్డు ముందు ప్రతిపాదించింది. ఇందుకోసం జలాశయం నుంచి రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు నీళ్లు వదలాలని కోరారు. దీనిపై చర్చ జరిగినా నిర్ణయం జరగలేదని సమాచారం.ఆర్డీఎస్‌ ఆధునికీకరణకు ఏపీ సహకరించడం లేదని తెలంగాణ అసంతృప్తి వ్యక్తంచేసింది. కేసీ కాలువ, ఆర్డీఎస్‌లు బోర్డు పరిధిలోకి రావని, ఈ రెండింటినీ తీసుకున్న తర్వాత చర్చిద్దామని ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి అన్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి:

రెండు రాష్ట్రాలకూ అపెక్స్‌ కౌన్సిల్‌ మినిట్స్‌!

ABOUT THE AUTHOR

...view details