మద్యం రవాణా చేస్తున్నారనే కారణంతో రంపచోడవరం, జగ్గయ్యపేట పోలీసులు ఏపీ ఎక్సైజ్ సవరణ చట్టం -2020లోని సెక్షన్ 34 (ఎ) ప్రకారం కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడాన్ని సవాలు చేస్తూ కొందరు వేర్వేరుగా రెండు వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలు చేశారు . వీటిపై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు జి.వెంకటేశ్వరరావు, పి.రాజశేఖర్ వాదనలు వినిపించారు. 2010 సెప్టెంబర్ 24 న ఎక్సైజ్ శాఖ జారీచేసిన జీవో 411 కు విరుద్ధంగా పోలీసులు కేసు నమోదు చేశారని.... ఆ జీవో ప్రకారం ఎప్పుడైనా ఎలాంటి అనుమతి , లైసెన్స్ లేకుండా...పరిమాణంతో సంబంధం లేకుండా ఓ వ్యక్తి గరిష్ఠంగా 3 ఐ.ఎస్.ఎమ్.ఎల్ బాటిళ్లు కలిగి ఉండొచ్చన్నారు. ప్రస్తుత వ్యాజ్యాల్లో సదురు వ్యక్తి 3 బాటిళ్లకు లోపు మద్యాన్ని కలిగి ఉన్నప్పటికీ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు . పొరుగురాష్ట్రంలో మద్యం కొనుగోలు చేసి ఒకసారి పన్ను చెల్లించాక వాటి పై ఏపీ ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టడానికి వీల్లేదన్నారు . నిర్దిష్ట పరిమాణంలో మద్యం తీసుకెళ్లేందుకు చట్టం అనుమతిస్తోందని వాదించారు.
మద్యం వర్తకం, వినియోగం, రవాణా విషయంలో సహేతుకమైన షరతులున్నాయని ఎక్సైజ్ శాఖ తరపు న్యాయవాది వాదించారు. ఏపీ లోపల కొనుగోలు చేసిన 3 మద్యం బాటిళ్లను మాత్రమే ఓ వ్యక్తి కలిగి ఉండటానికి వీలుందని.. ఏపీకి వెలుపల కొనుగోలు చేసి మద్యాన్ని రాష్ట్రంలోకి దిగుమతి చేసిన మద్యంగా భావించాల్సి ఉంటుందన్నారు . మద్యాన్ని రాష్ట్ర ఆంశంగా రాజ్యాంగంలో పేర్కొన్నారన్న ఆయన...పరిమితులను విధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఎలాంటి పన్ను విధించకుండా మద్యాన్ని రాష్ట్రం లోపలికి అనుమతిస్తే ఖజానాను నష్టం వాటిల్లుతుందని వాదించారు. హైకోర్టులో దాఖలైన రెండు వ్యాజ్యాలను కొట్టేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు.