రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్ణయాల్ని పునస్సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం, సిట్ చర్యలను నిలువరిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఉపసంఘం, సిట్ ఏర్పాటుకు సంబంధించిన జీవోల ఆధారంగా తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఈ పిటిషన్లలో కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను ప్రతివాదులుగా చేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌నూ కొట్టేసింది. ఈ వ్యాజ్యాల్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
‘మనకు ఒక రాజ్యాంగం ఉండగానే సరిపోదు, దానివల్లే రాజ్యాంగ సంస్కృతి పరిఢవిల్లదు. రాజకీయ నాయకత్వం ప్రదర్శించే పరిపక్వత, సత్సంప్రదాయాల్ని పాటించే ప్రజలున్న చోట మాత్రమే రాజ్యాంగ సంస్కృతి వర్థిల్లుతుంది. అది లేనిచోట రాజ్యాంగ విలువలు పుస్తకాలకే పరిమితమైన ఆదర్శాలుగా మిగిలిపోతాయి’ అంటూ ‘ఆర్‌సీˆ పౌడ్యాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసు తీర్పులో జస్టిస్ వెంకటాచలయ్య చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తి గుర్తు చేశారు. ప్రస్తుత వ్యాజ్యాల విషయంలో ప్రజాస్వామ్యంలోని ముఖ్యాంశాలకు తగ్గట్టు ప్రభుత్వ చర్యలు లేవని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. పైన పేర్కొన్న సుప్రీˆంకోర్టు తీర్పు, న్యాయశాస్త్ర నియమం (రూల్ ఆఫ్ లా) ప్రకారం గత ప్రభుత్వ విధానాల్ని ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం తప్పనిసరిగా అనుసరించాలన్నారు. బలమైన, స్పష్టమైన కారణాలున్నప్పుడు మాత్రమే ఆ విధానాల నుంచి పక్కకు తప్పుకోవచ్చన్నారు. అలాంటి కారణాలేవీ ఈ కేసులో కనిపించడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ పునస్సమీక్షించే విశృంఖలాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు.
పునస్సమీక్షించే అధికారం చట్టం ద్వారా దఖలు పడాలి తప్ప ప్రభుత్వానికి స్వతస్సిద్ధంగా లేదన్నారు. ఫలానా చట్టం ద్వారా సమీక్షించే అధికారం ఉందని ప్రభుత్వం చెప్పలేకపోయిందని తెలిపారు. ప్రభుత్వ విధానాలు ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా ఉన్నా, సహేతుకంగా లేకపోయినా న్యాయస్థానాలు సమీక్షించ వచ్చని గుర్తు చేశారు. కోర్టు ముందున్న వివరాల్ని పరిశీలిస్తే.. తగిన సమయం తీసుకున్నా ఆరోపిత నేరాలకు సంబంధించి దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదన్నారు. కొన్ని అంశాల్లో పరిమితులకు లోబడి సమీక్షిస్తున్నట్లు కనిపించడం లేదని తప్పుపట్టారు. మంత్రివర్గ ఉపసంఘం, సిట్ ఏర్పాటును సమర్థించేందుకు తగిన ఆధారాల్లేవని తేల్చిచెప్పారు. నేరం నమోదు చేయకముందే దర్యాప్తు చేయడం, నేరాలను తరగతులుగా విభజించడం, ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు అభ్యర్థించడంలో విధానపరమైన లోపాలున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రమే/ ప్రభుత్వమే ఈ వ్యవహారంలో ఫిర్యాదుదారుగా, దర్యాప్తుదారుగా, అపరిమితమైన పునస్సమీక్ష అధికారం కలిగి ఉన్నాయనే దురభిప్రాయం కలిగిస్తోందన్నారు. వ్యాజ్యాల్ని విచారణకు సీˆ్వకరిస్తున్నామని తెలిపారు.
పిటిషన్లు వేసిన వర్ల, ఆలపాటి
గత ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన విధానాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలు, ముఖ్య పాలనా అనుమతుల్ని సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ 2019 జూన్ 26న ప్రస్తుత ప్రభుత్వం జీవో జారీచేసింది. ఉపసంఘం నివేదికలోని అంశాల ఆధారంగా దర్యాప్తు చేసేందుకు నిఘా విభాగం డీఐజీ కె.రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో పదిమంది పోలీసు అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేస్తూ 2020 ఫిబ్రవరి 21న మరో ఉత్తర్వు ఇచ్చింది. ఆ రెండు జీవోలను సవాలు చేస్తూ తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. బుధవారం నిర్ణయాన్ని వెల్లడించారు.