అప్పులతో దినదిన గండంగా రాష్ట్రాన్ని నెట్టుకొస్తున్న వైకాపా ప్రభుత్వం.. రుణాల సేకరణలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ రుణం రూ.28 వేల కోట్లు తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతిచ్చింది. సగటున నెలకు రూ.2,500 కోట్ల చొప్పున ఆ అప్పు సమీకరిస్తే ఏడాది మొత్తానికి సమంగా వాడుకున్నట్లవుతుంది. దీనికి భిన్నంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే నెలలో స్థాయికి మించి రుణాన్ని రాష్ట్రం తీసుకుంది. ఈ నెలలో రిజర్వు బ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో.. ఇప్పటికే రూ.7 వేల కోట్లు అప్పు తెచ్చింది. ఇవాళ ఆర్బీఐ నిర్వహించే వేలంలో మరో రూ.2,500 కోట్ల రుణ సేకరణకు ప్రయత్నిస్తుంది. ఆ మొత్తం తీసుకుంటే.. ఒక్క మే నెలలోనే రూ.9,500 కోట్లు అప్పు తెచ్చినట్లవుతుంది. అంటే.. కేంద్రం అనుమతించిన దాంట్లో మూడో వంతు మే నెలలోనే పూర్తైనట్లే.
మే 10న.. 10 ఏళ్ల కాలానికి 7.76 శాతం వడ్డీ రేటుతో వెయ్యి కోట్లు తెచ్చిన ప్రభుత్వం...ఇదే రోజున 19 ఏళ్ల కాలానికి 7.78 శాతం వడ్డీతో మరో వెయ్యి కోట్లు.....20 ఏళ్ల కాలానికి 7.78 శాతం వడ్డీకే ఇంకో వెయ్యి కోట్లు సేకరించింది. మే 17న 5 ఏళ్ల కాలానికి 7.46 శాతం వడ్డీకి వెయ్యి కోట్లతో పాటు 8 ఏళ్ల కాలానికి 7.63 వడ్డీ రేటుకు మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చింది. మే 24 న 9 ఏళ్ల కాలానికి 7.71 శాతం వడ్డీకి ఇంకో వెయ్యి కోట్లతో పాటు 10 ఏళ్ల కాలానికి 7.67 శాతం వడ్డీకి మరో వెయ్యి కోట్లు తెచ్చింది. ఈ రోజు రిజర్వుబ్యాంకు వేలం ద్వారా మరో 2వేల 5వందల కోట్ల అప్పు సేకరణకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం....అందులో వెయ్యి కోట్లు 9 సంవత్సరాలకి, మరో వెయ్యి కోట్లు 12 సంవత్సరాల కాలానికి, ఇంకో 5వందల కోట్లు 11 ఏళ్లకి రుణం తేవడానికి యత్నిస్తోంది. ఎంత వడ్డీ ధరకు రుణం సమీకరించేది ఇవాళ తేలుతుంది.
ఆదాయం కన్నా.. రుణం ఎక్కువ..: ఒక నెలలో రాష్ట్రం సొంత పన్నుల, పన్నేతర ఆదాయం కన్నా తీసుకుంటున్న రుణం ఎక్కువ. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన అంచనాల ప్రకారం...రాష్ట్ర పన్నుల రాబడి 73వేల689.77 కోట్లు. పన్నేతర రాబడి 5వేల451.20 కోట్లు. ఈ రెండు కలిపి చూసి నెలకు వచ్చే రాబడిని లెక్కిస్తే కేవలం 6వేల595 కోట్లుగా తేలుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ లెక్కల్లో పన్ను, పన్నేతర రాబడిని లక్ష 2వేల 142 కోట్లుగా లెక్కించింది. ఆ రూపేణా చూసినా రాష్ట్రానికి నెలకు సొంతంగా వచ్చే పన్నులు, పన్నేతర రాబడి 8వేల511 కోట్లే.