ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి మంగళవారం మరో రూ.2వేల కోట్ల రుణాన్ని సేకరించింది. దీంతో ఈ నెలలో ఇప్పటివరకు రూ.5వేల కోట్ల అప్పు తీసుకున్నట్లయింది. ఆర్‌బీఐలో మంగళవారం జరిగిన ‘రాష్ట్ర అభివృద్ధి రుణాల’ వేలం ద్వారా 16ఏళ్లకు రూ.వెయ్యి కోట్లు, 18 ఏళ్లకు మరో వెయ్యి కోట్ల చొప్పున సేకరించింది. మొత్తం 13 రాష్ట్రాలు రూ.14,175 కోట్ల రుణం కోసం నోటిఫై చేయగా రూ.15,675 కోట్లను సమీకరించాయి.
హరియాణా, మహారాష్ట్ర అదనంగా తీసుకున్నాయి. 20 ఏళ్ల కాలపరిమితితో పశ్చిమబెంగాల్‌పై 6.77%, 14 ఏళ్లకు కర్ణాటకపై 6.77%, 13 ఏళ్లకు మధ్యప్రదేశ్‌పై 6.79% వడ్డీ భారం పడింది. అదే ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం 16 ఏళ్ల రుణంపై 6.85%, 18 ఏళ్ల రుణంపై 6.87% వడ్డీ నమోదైంది. అన్ని రాష్ట్రాల కన్నా ఏపీపైనే ఎక్కువ వడ్డీ పడింది. ఇటీవల తీసుకున్న రూ.3వేల కోట్లలో 4ఏళ్లకు వెయ్యి కోట్లపై కేవలం 5.52% వడ్డీ పడగా... 15, 19 ఏళ్లకు 6.68% వడ్డీతో వెయ్యి కోట్ల చొప్పున రుణం తీసుకుంది.