3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అన్న నినాదం 4వందల రోజుల మైలురాయికి చేరుకొంది. మహిళలు, వృద్ధులు సహా ఇంటిల్లిపాదీ దీక్షా శిబిరాలలోనే ఉంటూ అమరావతి గ్రామాల ప్రజలు పట్టు వదలకుండా పోరాటం సాగిస్తున్నారు. ప్రభుత్వం, నేతల వ్యవహార శైలి నానాటికీ కుంగదీస్తుండగా..మనోవ్యథతో కొందరు అసువులు బాసారు. అయినాసరే వెనకడుగేసే ప్రసక్తే లేదని మహిళలు తేల్చిచెబుతున్నారు. ప్రాణాలు అడ్డు వేసైనా అమరావతిని కాపాడుకుంటామని సంకల్పబలం ప్రదర్శిస్తున్నారు. ఇవాళ తుళ్లూరు నుంచి అమరావతి గ్రామాల మీదుగా మందడం వరకూ భారీ ర్యాలీకి సన్నద్ధమవుతున్నారు.
రైతుల్ని జీవచ్ఛవాలుగా మార్చిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో నమోదైన కేసుని హైకోర్టు కొట్టేసింది. రాజధాని పోరాటం 4వందల రోజులకు చేరుకున్న తరుణంలో హైకోర్టు తీర్పు అమరావతి వాసులకు గొప్ప ఊరటనిచ్చింది.