రాష్ట్రంలో మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో (2019-20) రాష్ట్ర సొంత ఆదాయం, పన్ను ఆదాయాలు, పన్నేతర ఆదాయాలే కాదు... కేంద్రం నుంచీ ఆశించిన స్థాయిలో నిధులు దక్కలేదు. బడ్జెట్ సమర్పణ సమయంలో వేసుకున్న అంచనాలన్నీ తప్పాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2018-19)లో వచ్చిన స్థాయిలోనూ ఆదాయం రాలేదు. ప్రజారుణంతోనే ఆర్థిక సంవత్సరాన్ని ముందుకు నడిపించాల్సి వచ్చింది. ప్రజాపద్దు ద్వారా సమకూరిన మొత్తాలు, పెరిగిన రుణాలు కలిపితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వసూళ్లు అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.30వేల కోట్ల వరకు పెరిగినట్లు ఆర్థికశాఖ అధికారులు లెక్కలు వేశారు.
సాధారణంగా బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఆదాయం తగ్గినా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం కన్నా అంతో ఇంతో కాస్త ఎక్కువే వస్తుందని భావిస్తారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఈ రెండింటికీ దూరంగానే సాధించిన ఆదాయం ఉంది. రాష్ట్రంలో అమ్మకపు పన్ను, మోటారు వాహనాల పన్ను, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం కూడా 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తక్కువే. ఎక్సైజ్ ఆదాయమే కొంత పెరిగింది.
కేంద్రం నుంచి ఆశించినవీ రాలేదు. కేంద్ర సాయం పైనా, కేంద్ర పన్నుల్లో వాటాపైనా రాష్ట్రం ఎక్కువ ఆశ పడుతోంది. ఆ మేరకు ఆసరా అందడం లేదు. అంతకుముందు ఏడాది కాస్త ఎక్కువ మొత్తాలు వచ్చినట్లు ఆర్థికశాఖ లెక్కలు పేర్కొంటున్నాయి. కేంద్రగ్రాంట్లు రూ.60వేల కోట్లకు పైగా వస్తాయనుకుంటే, అందులో మూడోవంతూ రాలేదు.