Termites ate Money: వృద్ధాప్యంలో కాస్త దీమాగా ఉండొచ్చని ఆ దంపతులు రాత్రి పగలు చెమటోడ్చి పైసా పైసా కూడబెట్టారు. ఆ దంపతులకు పిల్లలు లేకపోవడంతో మంచాన పడినప్పుడు ఆ డబ్బే ఆసరాగా ఉంటుందనుకున్నారు. రేయనకా పగలనకా కూలీ నాలీ చేస్తూ సుమారు లక్షన్నర వరకు డబ్బు దాచిపెట్టుకున్నారు. కానీ చెదపురుగుల రూపంలో వారి కష్టం ముక్కలైంది. ఈ ఘటన తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
వివరాలలోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బాలాజీ నగర్‌కు చెందిన గడ్డం లక్ష్మయ్య.. కూలీ పనులు చేస్తుంటాడు. భార్య లక్ష్మీ ఎండుమిర్చి తొడిమెలు తీసుకుంటూ చిల్లర వెనుకేస్తోంది. ఇలా.. ఒక్కో రూపాయి కూడబెట్టుకుని.. మొత్తం లక్షన్నర వరకు దాచిపెట్టుకున్నారు. పిల్లలు లేని ఈ దంపతులకు.. దాచుకున్న సొమ్ము ఆసరాగా ఉంటుందని భావించారు. కానీ.. అంతలోనే చెదలు వారి ఆశలను చెల్లాచెదురు చేసింది. సూట్‌కేస్‌లో దాచుకున్న నోట్లకు చెదలు పట్టడంతో పనికిరాకుండా పోయాయి. నోట్ల ముక్కలతో బ్యాంకుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవటం లేదని వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ డబ్బులు దక్కేలా చూడాలని ఆ వృద్ధ దంపతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.