రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత..ఈనెల 27నుంచి ప్రారంభమైన పదోతరగతి పరీక్షల నిర్వహణపై వరుస వివాదాలు తలెత్తుతున్నాయి. 27, 28 తేదీల్లో తెలుగు, హిందీ పేపర్లు ప్రారంభమైన గంటన్నర తర్వాత బయటకు వచ్చాయని, దీన్ని లీక్‌గా భావించబోమని అధికార యంత్రాంగం ప్రకటించింది. అనంతరం శ్రీ సత్యసాయి జిల్లాలో ఆంగ్ల పరీక్ష మొదలైన 8 నిమిషాల్లోనే సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ప్రత్యక్షమైంది. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో పరీక్షా కేంద్రం నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు ప్రచారం సాగింది. ప్రశ్నపత్రాలను తెరిచే సమయంలోనే సెల్‌ఫోన్లతో ఫొటోలు తీస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజు ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వస్తుంటే....ఇలాంటి పరీక్షలు ఎందుకు నిర్వహించడమని కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉమ్మడి ప్రశ్నపత్రంతో నిర్వహించే సమ్మెటివ్-1 పరీక్ష నుంచే ఆయా ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వస్తూనే ఉన్నాయి. ఇవి పబ్లిక్ పరీక్షలు కానందున అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అప్పట్లోనే ఈ లీక్‌పై కఠిన చర్యలు తీసుకుని ఉంటే కొంత వరకు పదో తరగతి పరీక్షల్లో అడ్డుకట్టపడి ఉండేదని పలువురు భావిస్తున్నారు.
విద్యాశాఖకు సరైన దృష్టి లేదు:దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ పదోతరగతి సెమిస్టర్-2 పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ దాదాపు 30వేల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఈ ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్న ఘటనలు ఇంతవరకు వెలుగు చూడడం లేదు. అయితే రాష్ట్రంలో ఇంత అధికార యంత్రాంగం, పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ..రాష్ట్ర బోర్డు ప్రశ్నపత్రాలు మాత్రం ఎందుకు బయటకు వస్తున్నాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పరీక్షల నిర్వహణపై విద్యాశాఖకు సరైన దృష్టి లేకపోవడమే దీనికి కారణమని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.
తూతూమంత్రంగా పరీక్షల నిర్వహణ: పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను ఎందుకు అనుమతిస్తున్నారనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. ఒక్కో కేంద్రం వద్ద ఒకరిద్దరు పోలీసులను పెట్టి.. ఇన్విజిలెటర్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ ఫోన్లును ముందుగానే తీసుకోవచ్చు. కానీ అలా జరగట్లేదు. ఒకవేళ అత్యవసర పని ఉంటే... పోలీసు సమక్షంలోనే ఫోన్ చేసుకునేలా ఏర్పాటు చేస్తే ఇబ్బందులు రావన్నది విశ్లేషకుల మాట. వీటిన్నింటినీ పట్టించుకోకుండా పైనుంచి కింద స్థాయి వరకు తూతూమంత్రంగా పరీక్షల నిర్వహణ చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.