తెలంగాణలో గతేడాది మాదిరిగానే పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. పరీక్షలకు రుసుం చెల్లించిన 5 లక్షల 21 వేల మంది విద్యార్థులు.. పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులు కానున్నారు. ఫలితాల ప్రకటనకు తగిన నిష్పాక్షిక విధానం రూపొందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతర్గత పరీక్షలుగా పిలిచే ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1 ఇప్పటికే పూర్తయినందున.. వాటి ఆధారంగా గ్రేడ్‌లు ఇవ్వొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అంటే ఒక్కో సబ్జెక్టులో అంతర్గత పరీక్షలకు 20 మార్కులుంటాయి. వాటిలో వచ్చిన మార్కులను వందకి లెక్కిస్తారు. ఉదాహరణకు 20కి 18 మార్కులు వస్తే.. దాన్ని 100కి 90గా లెక్కించి గ్రేడింగ్‌లు ఇస్తారు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించే విధానంలో వచ్చిన గ్రేడ్లపై విద్యార్థులు సంతృప్తి చెందకుంటే.. భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలించినప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని వాటికి హాజరుకావచ్చొని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేయనున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలనూ వాయిదా వేశారు. జూన్ మొదటి వారంలో సమీక్షించి పరీక్షల తేదీలను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండో సంవత్సరంలో ఉన్న విద్యార్థులకు బ్యాగ్‌లాక్‌లు ఉంటే వాటికి కనీస మార్కులు ఇచ్చి పాస్ చేస్తామని తెలిపారు. ఇక రెండో ఏడాది పరీక్షల వాయిదాతో.. ప్రయోగ పరీక్షల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై ఇంటర్‌బోర్డు స్పష్టత ఇవ్వలేదు.