భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay tour) పర్యటన నేపథ్యంలో నల్గొండలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని మిర్యాలగూడ సమీపంలోని శెట్టిపాలెం వద్ద భాజపా, తెరాస శ్రేణుల పరస్పర దాడుల నడుమ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వందలాదిగా తరలివచ్చిన జనం మధ్యన... ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. బండి సంజయ్ వెనక్కి వెళ్లాలంటూ తెరాస శ్రేణుల నినాదాలు చేశారు. తెరాస, భాజపా కార్యకర్తల పోటాపోటీ నినాదాలు చేశారు. రహదారిపై బైఠాయించి భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో తెరాస శ్రేణులు నిరసనకు దిగారు. ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడింది. తెరాస శ్రేణులకు బండి సంజయ్కు 20 మీటర్ల దూరం కూడా లేకపోవడం... పరిస్థితికి అద్దం పట్టింది. ఇదే అదనుగా తెరాస శ్రేణులు... నల్ల జెండాలతో నిరసన చేపట్టి కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. ఆగ్రహించిన భాజపా కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు.
అంతకు ముందుకు..
ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని బండి సంజయ్(Bandi sanjay in nalgonda) సందర్శిస్తుండగా... తెరాస కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ తెరాస శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. తెరాస శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. తెరాస శ్రేణులపైకి దూసుకెళ్లేందుకు భాజపా కార్యకర్తలు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. 'పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నార'ని భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఐకేపీ కేంద్రంలో తెరాస, భాజపా శ్రేణులు(trs vs bjp) పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. ఈ ఉద్రిక్తతల మధ్యే ఐకేపీ కేంద్రంలోని ధాన్యం రాశులను బండి సంజయ్ పరిశీలిస్తున్నారు.