జననీరాజనాల మధ్య అమరావతి రైతుల పాదయాత్ర Tension in Amaravati farmers padayatra:తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో అమరావతి రైతుల మహాపాదయాత్ర జననీరాజనాల మధ్య సాగింది. 34వ రోజు.. S. ముప్పవరం నుంచి మొదలైన యాత్రలో ఘన స్వాగతం లభించింది. భగవద్గీత, బైబిల్, ఖురాన్ చేతపట్టుకుని అమరావతి సర్వమతాల రాజధాని అంటూ రైతులు నినదించారు. కర్షకులతో కలిసి.. అడుగేసిన స్థానిక మహిళలు పిల్లల భవిష్యత్తు కోసం అమరావతికి జైకొడుతున్నామని చెప్పారు.
సాఫీగా సాగుతున్న పాదయాత్ర చాగల్లు చేరుకునే సరికి ఉద్రిక్తంగా మారింది. చాగల్లులో హోంమంత్రి వనిత అనుచరులు కవ్వింపులకు దిగారు. నల్లబెలూన్లు పట్టుకుని పాదయాత్ర వెళ్లే మార్గంలోకి వచ్చారు. పోలీసులు వారిని నిరసన తెలిపేందుకు వీలుగా.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. వైకాపా శ్రేణులు రోడ్డుకు ఓ వైపు నల్లబెలూన్లతో నిల్చుంటే.. అవతలివైపు రైతులకు మద్దతుగా తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు నిలబడ్డారు. ఈ దశలో పోలీసులు, అఖిలపక్షాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పాదయాత్రకు మద్దతుగా వచ్చిన వారిని.. పోలీసులు నెట్టేశారు. ఈ గందరగోళంలో 108వాహనం చిక్కుకోగా.. పోలీసులు దాన్ని దారి మళ్లించి పంపారు.
చాగల్లు సెంటర్‌లోని.. ఆంజనేయ స్వామి గుడి వద్ద పాదయాత్ర రథానికి స్థానిక మహిళలు హారతులిచ్చి పూజలు చేశారు. చాగల్లు మీదుగా పసివేదల చేరుకున్న అమరావతి రైతులు.. అక్కడ భోజనం చేశారు. అనంతరం నెలటూరు, నందమూరు సెంటర్ మీదుగా.. కొవ్వూరు చేరారు. కొవ్వూరులోని కళ్యాణమండపంలో బసచేసిన రైతులు..ఆదివారం పాదయాత్రకు విరామం ప్రకటించారు.
అమరావతి పాదయాత్రకు శ్రీకాకుళం రైతుల పూర్తి మద్ధతు:అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రకు మా పూర్తి మద్దతు ఉంటుందని శ్రీకాకుళం జిల్లా రైతులు తెలిపారు. జిల్లాలోని వందలాది రైతులు.. శ్రీకూర్మం పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిక్కోలు రైతులు చేసిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అమరావతి రైతుల పాదయాత్ర దిగ్విజయంగా జరగాలని, ఉత్తరాంధ్ర ప్రజలందరూ బ్రహ్మరంధం పడతారని.. రైతులు స్పష్టంచేశారు.
అమరావతి ఐకాసకు పోలీసుల నోటీసులు.. తిరస్కరించిన నేతలు: అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 34వ రోజు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ముగిసింది. ఆదివారం యాత్రకు విరామం ప్రకటించారు. సోమవారం యాత్ర కొవ్వూరు నుంచి గోదావరి నాలుగో వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోని మల్లయ్యపేట వద్దకు చేరుకోనుంది. రైల్ కమ్ రోడ్ వంతెనపై ఆంక్షల నేపథ్యంలో అమరావతి రైతుల యాత్ర ఈ మార్గంలోకి మార్చారు. అయితే కొత్తగా వెళ్లనున్న మార్గంలో ఎంత మందితో యాత్ర నిర్వహిస్తారో స్పష్టత ఇవ్వాలని పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు ప్రయత్నించారు.
నోటీసులు తీసుకునేందుకు అమరావతి ఐకాస కన్వీనర్ శివారెడ్డి, కో-కన్వీనర్ గద్దె తిరుపతిరావు తిరస్కరించారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు మరో మారు ఐకాస కో-కన్వీనర్ తిరుపతిరావును నోటీసు తీసుకోమని ఒత్తిడి తెచ్చారు. దీనిపై స్పందించిన ఆయన తాము న్యాయస్థానం అనుమతితో యాత్ర నిర్వహిస్తున్నామని, ఏమైనా చెప్పదల్చుకుంటే న్యాయస్థానం ద్వారా చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అప్పటికీ నోటీసులు తీసుకోవాలని ఒత్తిడి తేవడంతో యాత్రను అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నారు.. ఇంకా ఇబ్బంది పెట్టొద్దంటూ తిరుపతిరావు .. కొవ్వూరు టౌన్ సీఐ రవికుమార్ కాళ్లపై పడబోయారు. దీంతో వెనక్కి తగ్గిన పోలీసులు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఇవీ చదవండి: