10 YEARS FOR CBN YATRA : జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు నాశనమయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థను జగన్‌రెడ్డి ప్రైవేటు సైన్యంగా మార్చుకొని ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షనేతగా చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రదండు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి ఆదివారం చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు కేకు కోసి నాటి పాదయాత్ర స్మృతులను గుర్తు చేసుకొన్నారు. ‘ఉమ్మడి రాష్ట్రాన్ని నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్థికంగా, రాజకీయంగా ఛిన్నాభిన్నం చేయడంతో ప్రజలకు భరోసా ఇవ్వడానికి పాదయాత్ర చేశాను. నేడు ఏపీలో అంతకంటే దారుణ పరిస్థితులు ఉన్నాయి. శాంతిభద్రతలు కరవయ్యాయి. రాజధాని లేదు, కొత్త పరిశ్రమలు రావడం లేదు. ఎక్కడ చూసినా రౌడీయిజం, గూండాయిజం పేట్రేగిపోతున్నాయి. జగన్‌ను గద్దె దింపితే తప్ప రాష్ట్రం బాగుపడదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.