ATTENDANCE APP ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు విధానంలో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇదివరకు ఉదయం 9 గంటల్లోపే కచ్చితంగా నిర్దేశిత యాప్‌లో ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలని ఆదేశాలుండగా.. దానికి అదనంగా మరో 10 నిమిషాల గ్రేస్ సమయాన్ని ఇస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. నెట్‌వర్క్ సమస్యల కారణంగా యాప్ పనిచేయని సందర్భంలో ఆఫ్‌లైన్ ద్వారా హాజరు నమోదుచేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు వెల్లడించింది. ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్‌ను మరచిపోతే.. ఇతర ఉపాధ్యాయుల లేదా ప్రధానోపాధ్యాయుల సెల్‌ఫోన్‌లోనూ నమోదుకు అవకాశమిచ్చింది.
డిప్యుటేషన్, శిక్షణకు వెళ్లినప్పుడు, ఆన్‌డ్యూటీలో ఉన్నవారికి ప్రత్యేకంగా లీవ్ మాడ్యుల్‌ను ఈ నెల 25 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుల సెలవుల వివరాల్ని కూడా యాప్‌లోనే అప్‌డేట్ చేయాలని వెల్లడించింది. పైలెట్ విధానంలో ఈ నెలాఖరు వరకు యాప్‌లో హాజరు నమోదును కొనసాగిస్తామని, ఇప్పటికీ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోనివారు తక్షణమే పూర్తి చేయాలని స్పష్టం చేసింది.