ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పదో తరగతి పరీక్షలు వాయిదా? - 10th Exams postponed news

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. నెల రోజుల సమయం కావాలంటూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

10th Exams postponed
పదో తరగతి పరీక్షలు వాయిదా?

By

Published : May 25, 2021, 6:45 AM IST

పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నెల రోజులపాటు వాయిదా వేయాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. దీనిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటించనున్నారు. ఈనెల 31 వరకు కర్ఫ్యూ ఉండడం, కొన్ని పాఠశాలలను క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్పు చేయడంతో పరీక్షలకు ఏర్పాట్లు చేయడం కష్టంగా మారిందని విద్యాశాఖ పేర్కొంది. అదేసమయంలో పది పరీక్షలపై వివిధ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను సైతం ఇందులో ప్రస్తావించారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, హరియాణ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయి. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, గోవా, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాలు వాయిదా వేశాయి. బిహార్‌, కేరళలలో మాత్రం ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ కోరింది.

అంతర్గత మార్కుల నమోదు వేగం

పదో తరగతి పరీక్షలు వాయిదా పడితే భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం కోసం ముందుగా అంతర్గత మార్కుల నమోదు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. మూడు, నాలుగు రోజుల్లో అంతర్గత పరీక్షల మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది పదో తరగతి వారికి ఇప్పటివరకు రెండు ఫార్మెటివ్‌ పరీక్షలను ఒక్కోటి 50 మార్కులకు నిర్వహించారు.

ఉత్తర్వులను సవరిస్తేనే...

పదో తరగతి పరీక్షల సంస్కరణల్లో భాగంగా 2019లో అంతర్గత మార్కులను తొలగించారు. అంతకుముందు రాత పరీక్షకు 80, అంతర్గత పరీక్షలకు 20 మార్కులు ఉండేది. అంతర్గత పరీక్షల్లో ప్రైవేటు విద్యా సంస్థలు తమ విద్యార్థులకు అధిక మార్కులు వేసుకుంటున్నాయనే కారణంగా గతంలో దీన్ని తొలగించారు. వంద మార్కులకు పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అంతర్గత పరీక్షలకు ప్రాధాన్యం లేకుండాపోయింది. ఈ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత గతేడాది నిర్వహించాల్సిన పరీక్షలు కరోనా కారణంగా రద్దు చేశారు. ఒకవేళ పదిలో అంతర్గత మార్కులను పరిగణలోకి తీసుకోవాలంటే గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు సవరణలు తీసుకురావాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి:

ఏపీ ఉన్నత విద్య కమిషన్ తీరుపై హైకోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details