ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కార్తిక మాస పర్వదినం.. ఆలయాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికం - guntur news

కార్తిక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ జిల్లాలోని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గుంటూరు నగర శివార్లలోని ఏటుకూరులో వైభవంగా మహా రుద్రాభిషేకం నిర్వహించగా..కృష్ణా జిల్లా నందిగామలో కోటి దీపోత్సవం రమణీయంగా సాగింది. పెనుకొండను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అనంతపురంలో చేపట్టిన దీపోత్సవం కనువిందు చేయగా.. విశాఖ జిల్లా అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో నిమ్మకాయలతో చేసిన అమావాస్య పూజ భక్తి పరవశంలో ముంచెత్తింది.

temples-filled-with-devotees
ఆలయాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికం

By

Published : Dec 14, 2020, 10:56 PM IST

ఆలయాల్లో వెల్లివిరిసిన ఆధ్యాత్మికం

కార్తికమాసం సందర్భంగా గుంటూరు నగర శివార్లలోని ఏటుకూరులో వైభవంగా మహా రుద్రాభిషేకం జరిపారు. ఉగ్గిరాల సీతారామయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బాబాతో పాటు ఆయన శిష్య బృందం హాజరయ్యింది. నాలుగు అడుగులతో ఏర్పాటు చేసిన మృత్తికా శివలింగానికి పుణ్యనదీ జలాలతో అభిషేకం నిర్వహించారు. పరమశివునికి ప్రీతిపాత్రమైన 250రకాల ద్రవ్యాలతో మహా శాంతి నిర్వహించారు. పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, పంచదార, తేనె, విభూది, వివిధ రకాల పత్రాలు, పుష్పాలతో కార్యక్రమం జరిపారు. అభిషేకం జరుగుతున్నంత సేపు శంఖం, ఢమరుకం, ఘంఠానాథాలు మారుమోగాయి. మహా హారతితో కార్యక్రమాన్ని ముగించారు. మహారుద్రాభిషేకం చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఓం నమశ్శివాయ.. అంటూ శివుడిని ప్రార్థించారు.

నందిగామలో కోటి దీపోత్సవం..

కృష్ణా జిల్లా నందిగామలో గణపతి ఉత్సవ కమిటీ, వాసవి మార్కెట్ సంయుక్త ఆధ్వర్యంలో కార్తికమాస పర్వదినాన్ని పురస్కరించుకుని కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని రమణీయంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్​కుమార రామానుజ జీయర్ స్వామి హాజరయ్యారు. కార్తిక మాసంలో శివునికి చేసే పూజలు, వాటివల్ల లభించే పుణ్యఫలాలు గురించి ఆయన వివరించారు. అనంతరం 216 మంది దంపతులతో కోటి దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు దీపాలను వెలిగించారు. పురోహితులు గౌరీ పెద్ది రామకృష్ణ సాయి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పెనుకొండ కోసం కోటి దీపోత్సవం..

పెనుకొండను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ అనంతపురం జిల్లాలో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 44వ జాతీయ రహదారి పక్కనున్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ముందు, పర్యాటక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం వైభవంగా జరిగింది. జిల్లా కేంద్రంగా పెనుకొండ అనువైన ప్రాంతమని వక్తలు అన్నారు. శ్రీకృష్ణదేవరాయల రెండవ రాజధానిగా ఉండేదని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంగా పెనుకొండను ఏర్పాటు చేయాలని కోటి దీపోత్సవ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రత్యేక హోమాలు, పూజలు చేశారు.

భీమలింగేశ్వర స్వామి ఆలయంలో 1001 దీపాలు..
కార్తిక మాసం సందర్భంగా అనంతపురం జిల్లా విడపనకల్ మండలం గడేకల్లు భీమలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాల ముందు 1001 దీపాలు వెలిగించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

అనంతపురం జిల్లా కదిరిలో...

అనంతపురం జిల్లా కదిరి పట్టణం కుటాగుళ్ల కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తిక దీపోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ సభ్యులు లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన నాగరాజు దీపోత్సనానికి సంబంధించిన సామగ్రిని భక్తులకు అందజేశారు. కార్తిక సోమవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు.

అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో అమావాస్య పూజలు...

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన విశాఖ జిల్లా అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో అమావాస్య పూజలు ఘనంగా నిర్వహించారు. రాహుకాల పూజ సందర్భంగా నిమ్మకాయలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. నైవేద్యం పెట్టి ప్రత్యేక కార్యక్రమాలు జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాన్ని దర్శించుకున్నారు.

చిత్తూరు జిల్లాలో...

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పచ్చికాపలం ద్రౌపతి దేవిఆలయంలో కార్తిక మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ప్రతాప్ స్వామిజీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామీజీ చేతుల మీదుగా మృత్తిక శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు. భక్తుల హర నామస్మరణల మధ్య మహా హారతి ఇచ్చి నైవేద్యాలు సమర్పించారు.

ఇదీ చదవండి:వైఎస్ జలకళ పథకానికి సవరణలు.. ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details