ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్ : ఆశీర్వదించే చేయి సాయం కోసం ఎదురుచూస్తోంది - దేవాలయాలపై కరోనా ప్రభావం

ఆయుష్మాన్ భవ....శతమానం భవతి... దీర్ఘ సుమంగళీ భవ... విద్యా ప్రాప్తిరస్తు... సర్వకార్యసిద్ధిరస్తు అంటూ సందర్భోచితమైన మాటలతో అక్షితలు వేసి ఆశీర్వదించే అర్చకులు, పురోహితులు ఇప్పుడు కరోనా విలయానికి విలవిలలాడుతున్నారు. దేవుని చల్లని ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని, సిరి సంపదలతో సుభిక్షంగా ముందుకు సాగాలని మంత్రాలు జపిస్తూ దేవదేవునికి సేవలో తరించే వీరికి ఉపాధి కరవైంది. నిత్యం మంత్రాలు జపించే ఆ గొంతుల్లో నేడు ఆకలికేకలు వినిపిస్తున్నాయి. భక్తులు చల్లగా ఉండాలని నిండు మనస్సుతో ఆశీర్వదించే ఆ చేతులు చేయూతనిచ్చే వారి కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి.

కరోనా ఎఫెక్ట్ : ఆశీర్వదించే చేయి సాయం కోసం ఎదురుచూస్తోంది..
కరోనా ఎఫెక్ట్ : ఆశీర్వదించే చేయి సాయం కోసం ఎదురుచూస్తోంది..

By

Published : Jul 15, 2020, 3:47 PM IST

Updated : Jul 15, 2020, 3:53 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది బ్రాహ్మణ కుటుంబాలు సాయం కోసం నిరీక్షిస్తున్నాయి. దేవాలయాల్లో పూజలు లేక తమకు కొద్దోగొప్పో చేయూతను అందించే భక్తులు ఆలయాలకు వచ్చే పరిస్థితి లేకపోవడం, సాధారణంగా జరిగే పూజలు, పెళ్లిళ్లు వంటి పవిత్ర కార్యక్రమాలు సైతం కరోనా కారణంగా రద్దు కావడంతో బ్రాహ్మణ కుటుంబాల్లో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. మార్చి నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. దేవాదాయ శాఖ పరిధిలోని ప్రధాన ఆలయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని దేవాలయాల్లో భక్తుల దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. కేవలం ఆలయాల్లో దేవతామూర్తులకు నిత్యం జరిగే కైంకర్యాలను ఏకాంతంగా జరిపేవారు.

పేద బాహ్మణులకు పూట గడవట్లేదు

సాధారణ రోజుల్లో ఆయా దేవాలయాలకు వచ్చే భక్తులు వారు చేసే పూజలకు మెచ్చి కానుకల రూపంలో వారికి ఎంతోకొంత సంభావన ఇచ్చేవారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఎక్కడా లేకపోవడం, దేవాలయాల్లో ఇప్పటికీ ఏకాంత పూజలు మాత్రమే జరుగుతుండడంతో పేద బ్రాహ్మణులకు పూట గడవడమే కష్టంగా మారింది. లాక్‌డౌన్‌ సడలింపులతో ఆలయాల దర్శనాలకు అనుమతిచ్చినా- పూర్వపు వాతావరణం లేదు. ఆన్‌లైన్‌లో ముందస్తు టిక్కెట్లు తీసుకున్న వారికే ఆలయ దర్శనం కల్పిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులకు ఆలయ ప్రవేశాలపై ఆంక్షలు విధించారు.

అర్చకులకు ఆర్థిక కష్టాలు

రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో దేవాదాయశాఖ పరిధిలో చిన్నా, పెద్ద అన్నీ కలిపి సుమారు 30 వేల దేవాలయాలు ఉన్నాయి. ప్రైవేటు ఆధీనంలోని ఆలయాలు మూడింతల రెట్టింపులోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా దేవాలయాలపై ఆధారపడి సుమారు లక్షన్నర మంది అర్చకులు జీవనం సాగిస్తున్నారు. అదే విధంగా ఆయా దేవాలయాల్లో అత్యవసర సమయాల్లో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తూ పౌరోహితం చేసుకుంటూ జీవనం సాగించే బ్రాహ్మణులు మరో రెండు లక్షల మందికిపైనే ఉన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన దేవాలయాల్లో దర్శనాలను పూర్తిగా రద్దు చేయడంతో దేవాదాయ శాఖ పరిధిలో రెగ్యులర్‌ అర్చకులుగా ఉన్న వారికి మాత్రం జీతభత్యాలకు ఇబ్బంది లేకపోయినప్పటికీ తాత్కాలిక అర్చకులుగా పనిచేస్తున్న వేలాది మంది పేద బ్రాహ్మణులకు మాత్రం ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి.

వారికే సాయం

పౌరోహితం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే లక్షల మంది నిరుపేద కుటుంబాలు పూజలు లేక .. పెళ్లిళ్లు జరగక .. చేతిలో చిల్లిగవ్వ లేక ఆర్థికంగా చితికిపోతున్నారు. కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా సతమతమవుతున్న అర్చకులను ఆదుకునేందుకు ప్రభుత్వం కొంత చేయూతను అందించింది. దేవాదాయ శాఖ పరిధిలో అర్చకులుగా పేరు నమోదైన వారికి మాత్రమే ఆ మొత్తం అందింది. శాఖ పరిధిలో పేర్లు లేని వారికి సాయం అందలేదని పేద బాహ్మణులు వాపోతున్నారు.

గుళ్లకు తాళాలు

ఆలయాలకు వచ్చే భక్తులకు సైతం అనేక ఆంక్షలు విధిస్తుండడంతో ప్రత్యక్షంగా ఆలయ దర్శనాలు తగ్గిపోయాయి. విశేషమైన రోజుల్లో తప్పిస్తే ఎవరూ ఆలయాల వైపు చూడడంలేదు. ఈ పరిస్థితుల్లో చిన్న ఆలయాల నిర్వహణ దుర్భరంగా మారింది. ఆయా ఆలయాల నిర్వాహకులు తమ సొంత డబ్బులను అర్చకులకు చెల్లించలేక, గుడికి తాళాలు వేస్తున్నారు. వాణిజ్య సముదాయాలు వద్ద మంగళవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో చేయించుకునే పూజలు కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి. పితృకార్యక్రమాలు సైతం సంప్రదాయానుసారం నామమాత్రమే జరుగుతున్నాయి. ఇలా అర్చకులు... పురోహితలు... వారికి సహకారం అందించే వారికి కరోనా కాలం తీవ్ర పరీక్ష పెడుతోంది. అందరికీ శుభాశీస్సులు అందించే తమ బతుకుల్లో వెనుకటి వెలుగులు కనిపించడం లేదనే నిస్సహాయతతోనే అనేక మంది కాలం వెళ్లదీస్తున్నారు.

ఇదీ చదవండి :'జగన్ వచ్చినప్పటి నుంచి విజయవాడ వెనక్కు వెళ్లిపోయింది'

Last Updated : Jul 15, 2020, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details