temperatures: తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా గరిష్ఠంగా 35 డిగ్రీల సెల్సియస్ దాటింది. రానున్న 3 రోజుల్లో మరో 3 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. నిత్యం ఎండలో తిరిగేవారు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి ఎక్కువగా డీ హైడ్రేషన్ ముప్పు ఎక్కువ. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం, ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకోవాలన్నారు.
- వ్యాయామం ఉ. 6-7 గంటల మధ్య పూర్తి చేసుకోవాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత వాకింగ్ వద్దు. బయట పనులు ఉ.9 లోపు పూర్తి చేసుకోవాలి. మ.11 తర్వాత సా.4 గంటలోపు ఎండలో తిరగడం మంచిది కాదు.
- పిల్లల్ని సాయంత్రం 4 తర్వాతే ఆడుకోనివ్వాలి.
- ఉక్కపోతకు చెమట రూపంలో శరీరంలో నీరంతా బయటకు పోతున్నపుడు నీరసం వస్తుంది. అలసట, నిస్సత్తువ ఉంటుంది.
- మంచి ఆహారం, ఆరోగ్య పానీయాలతో నిస్సత్తువకు చెక్ పెట్టవచ్చునని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.
- మాంసాలు, ఉప్పు, కారం ఉండే కూరలు, వేపుళ్లు ఎక్కువగా తీసుకోవద్దు. నీళ్లు శాతం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలతో చేసుకునే పదార్థాలు తీసుకోవడం మేలు చేస్తాయి.
- ఉప్పు కలిసిన నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్‌ఎస్ లాంటి ద్రావణాలు తీసుకుంటే నీరసం దరి చేరదు.
- కీరదోస, క్యారెట్, క్యాబేజీ, ఉల్లి, టమాటా ముక్కలు, పెరుగుతో సలాడ్లు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవచ్చు.
- లెమన్ రైస్, కొత్తమీర రైస్, పుదీనా రైస్, పాలక్ రైస్ చేసుకోవడం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. అవసరమైతే ఉదయం సాయంత్రం చపాతీలు తీసుకోవచ్చు. మధ్యాహ్నం మాంసాహారం తినకపోవడం మంచిది.
- భోజనం తర్వాత ఏదైనా ఒక ఫ్రూట్ తప్పనిసరిగా తీసుకోవాలి. మామిడి, తర్బూజ, పైనాఫిల్, బొప్పాయి లాంటివి తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచుతాయి. భోజనం చివర పెరుగు, లేదంటే మజ్జిగ తీసుకుంటే శరీరానికి సోడియం, పోటాషియం అందుతుంది. నిస్సత్తువ దరి చేరదు.
- ఎండలో ఎక్కువ పనిచేసేవారు అన్నంతోపాటు ములక్కాయ, సొరకాయ, పొట్లకాయ, క్యారెట్, ఆనపకాయ ముక్కలు వేసి సాంబారు చేసుకోవాలి.
బేగంపేటలో అత్యధికంగా 39.6 డిగ్రీలు
తెలంగాణలోని బేగంపేట నగరంలో ఎండల తీవ్రత పెరిగింది. పగటిపూట భానుడు భగ్గుమంటున్నాడు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గురువారం సిటీలో 39.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణం పొడిగా మారడంతో చాలా ప్రాంతాల్లో 38 డిగ్రీలపైనే నమోదయ్యాయి. మార్చిలోనే మాడు పగిలే ఎండలతో నగరవాసులు ఉసూరుమంటున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కపోత మొదలైంది. రాగల మూడు రోజుల వరకు వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీల మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 22 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని సూచించింది.