తెల్లారింది మొదలు సూరీడు సుర్రుమంటున్నాడు. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే 36 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి గంటలు గడిచే కొద్దీ 43 డిగ్రీల వరకు వేడిని పెంచుతున్నాడు. శుక్రవారం గరిష్ఠంగా గ్రేటర్‌లో 43 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు అధికం.
గంటగంటకూ.. మంట - భాగ్యనగరంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రోహిణీ కార్తెలో హైదరాబాద్ నిప్పుల కుంపటిగా మారింది. చాలాప్రాంతాల్లో వీస్తున్న వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలూ రాత్రి తేడా లేకుండా ఉక్కపోత పోస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలపైన నమోదవడం వేడి తీవ్రతకు అద్దం పడుతోంది. ఫ్యాన్లు తిరుగుతున్నా వేడి గాలి వస్తుండటంతో నిద్ర పట్టడం లేదని సామాన్యులు వాపోతున్నాయి.
![గంటగంటకూ.. మంట SUMMER HEAT IN HYDERABAD](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7401815-467-7401815-1590806635440.jpg)
కనిష్ఠ ఉష్ణోగ్రత 30.7 డిగ్రీలు నమోదైంది. ఇది కూడా సాధారణం కంటే 4 డిగ్రీలు అధికం. ఒక డిగ్రీ పెరిగితేనే తట్టుకోలేం అలాంటిది 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతుండటంతో ఎండలకు జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇళ్లకే పరిమితమైనా కాంక్రీట్ భవనాలైన ఇళ్లలో మరింత వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వంటింట్లోకి వెళ్లాలంటేనే..
ఉదయం 6 నుంచి 9 గంటల వరకు గృహిణులు వంటింట్లో పనిచేస్తుంటారు. 7 గంటల నుంచే వేడి తీవ్రత మొదలవటంతో వంటింట్లో మహిళలు వేడికి తట్టుకోలేకపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు స్టవ్ మంట వేడి తోడవటంతో వంటిల్లు నిప్పుల కుంపటిగా మారుతోంది. ఇరుకు వంటగదుల్లో గాలి ఆడక, అధిక వేడికి మహిళలు అనారోగ్యం బారినపడుతున్నారు.
- ఇదీ చూడండి:90 శాతం హామీల అమలు దిశగా అడుగులు: సీఎం