మండే ఎండలు.. వరసగా రెండో రోజూ నిప్పులు కురిపించాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలైంది. నిప్పులసెగ ముందు నిల్చున్న వాతావరణాన్ని తలపించింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 78 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పుల ప్రభావం నమోదైంది. 56 మండలాల్లో సగటున 45 డిగ్రీలకు పైగా, మరో 50 మండలాల్లో 44.6 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా కురిచేడు, కొనకనమిట్ల, కందుకూరు ప్రాంతాల్లో 45.8 డిగ్రీల చొప్పున నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తించాయి.
దక్షిణ కోస్తాలో అధికం
గుంటూరు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఎండల ప్రభావం అధికంగా ఉంది. శుక్రవారం కూడా ఈ తీవ్రత కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం, విపత్తుల నిర్వహణ సంస్థ సూచించాయి.
* తీరప్రాంతం, దక్షిణ కోస్తాలో గురువారం తీవ్ర వడగాల్పులు వీచాయి. గుంటూరు జిల్లాలో 14, కృష్ణాజిల్లాలో 14, ప్రకాశం జిల్లాలో 13, పశ్చిమ గోదావరి జిల్లా 11, చిత్తూరు జిల్లా ఎనిమిది, తూర్పు గోదావరి జిల్లా ఆరు.. విశాఖపట్నం, నెల్లూరు , కర్నూలు జిల్లాల్లో మూడు మండలాల చొప్పున.. కడప జిల్లాలో రెండు, శ్రీకాకుళం జిల్లాలోని ఒక మండలంలోనూ తీవ్ర ప్రభావం ఉంది.
రాత్రి 7 గంటలకూ 43 డిగ్రీల పైనే
గురువారం రాత్రి 7 గంటల సమయంలో పరిశీలిస్తే.. చిత్తూరు జిల్లా బంగారుపాళెం, ప్రకాశం జిల్లా తిప్పాయపాలెం 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి. అనంతపురం జిల్లా తేరన్నపల్లిలో 42.8, నెల్లూరు జిల్లా బోడిపాడు 42.1, కడప జిల్లా పొట్టిపాడు 41.0, గుంటూరు జిల్లా బండ్లమోడు 40.5, కర్నూలు జిల్లా పంచలింగాల 40.0 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.