ఏపీ.. బుధవారం భగభగలాడింది. ముఖ్యంగా కోస్తా ప్రాంతాన్ని సెగ చుట్టేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45.9 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గతేడాది మార్చి చివరి వారంతో పోలిస్తే 5 డిగ్రీలకు పైగా ఎండలు పెరగడం రాష్ట్రంలో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బుధవారం ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు 110 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీయడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడానికే భయపడ్డారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం 207 మండలాల్లో వడగాల్పులు వీచాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు, ప్రకాశం జిల్లా కురిచేడులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదైంది. విజయవాడలోనూ 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురు, శుక్రవారాల్లో వడగాల్పుల ప్రభావం మరింత పెరిగే ప్రమాదం ఉందని, 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అమరావతి వాతావరణ కేంద్రం, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించాయి.
మరో రెండ్రోజులు మంటలే
సూరీడి భగభగలు మరో రెండు రోజులు కొనసాగనున్నాయి. రాయలసీమతో పోలిస్తే.. కోస్తాలోనే సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో 47 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదు కావచ్చని చెప్పింది. శ్రీకాకుళం జిల్లా గుమ్మలక్ష్మీపురం, తూర్పుగోదావరి జిల్లా కూనవరం, కృష్ణా జిల్లా పెనమలూరు, తోట్లవల్లూరు, కంకిపాడు, ఉంగుటూరు, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి, చుండూరు, చేబ్రోలు, ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలాల్లో ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటవచ్చని అంచనా వేసింది. గురువారం కోస్తా, రాయలసీమల్లోని 330 మండలాల్లో, శుక్రవారం 355 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని వెల్లడించింది.
ఉత్తర, వాయవ్య, పశ్చిమ గాలులతో ఎండలు
- స్టెల్లా, డైరెక్టర్, అమరావతి వాతావరణ కేంద్రం
ఉత్తర, వాయవ్య, పశ్చిమ దిశ నుంచి వీస్తున్న వేడి, పొడి గాలులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఈ ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, వడగాల్పులు వీస్తాయి. కోస్తా ప్రాంతంపై ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. గాలుల దిశ మారితే ఏప్రిల్ 3 నుంచి వారంపాటు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత మళ్లీ పెరుగుతాయి.
వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండండి