అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కనీసం పదిరోజుల పాటు నిర్వహణ, ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి ప్రశ్నోత్తరాలను నిర్వహించటం, వివిధ సమస్యలపై లఘు చర్చల నిర్వహణ, అసెంబ్లీ కవరేజీకి అన్ని మీడియా సంస్థలను అనుమతించాలనే నాలుగు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని... ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.
వరుస విపత్తులు - రైతు సమస్యలు, టిడ్కో ఇళ్ల పంపిణీపై నిర్లక్ష్యం - ఇళ్ల పట్టాలకు భూసేకరణలో అవినీతి, అక్రమ వసూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దాడులు, దేవాలయాలపై దాడులు, పోలవరం ప్రాజెక్టు పనులపై నిర్లక్ష్యం - ఎత్తు తగ్గింపు ప్రయత్నాలు, వైకాపా అవినీతి కుంభకోణాలు, ఇసుక దోపిడీ, మద్యం మాఫియా, రాజధాని రైతుల ఆందోళనల వంటి అంశాలపై సభావేదికగా సమగ్ర చర్చ జరగాలని తెదేపా డిమాండ్ చేస్తోంది.
కరోనా బాధితులను ఆదుకోవడంలో వైఫల్యం, నిత్యావసరాల ధరల పెరుగుదల, పన్నుల పెంపు-పేదలపై భారం, రహదారుల మరమ్మతుల్లో నిర్లక్ష్యం, టోల్ విధింపు, పీపీఏల రద్దు - మూతపడుతున్న పరిశ్రమలు - పెరుగుతోన్న నిరుద్యోగం, సంక్షేమ పథకాల రద్దు - సబ్ప్లాన్ల నిర్వీర్యం.. వంటివి చర్చనీయాంశాలుగా చేపట్టాలని తెదేపా శాసనసభాపక్షం నిర్ణయించింది. నూతన ఇసుక విధానం - మైనింగ్ దోపిడీ, నరేగా బిల్లుల చెల్లింపు నిలిపివేత, మితిమీరిన అప్పులు - దుబారా వ్యయం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై సభావేదికగానే ప్రభుత్వాన్ని ఎండగడతామని ధీమా వ్యక్తం చేస్తోంది.
గత సమావేశాల్లో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం కల్పించని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమావేశాల్ని బహిష్కరించాలన్న ప్రతిపాదన పార్టీ ఎమ్మెల్యేల్లో వ్యక్తమైంది. దీనిపై సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సమావేశాలకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని కొందరు, వెళ్లాల్సిందేనని మరికొందరు అభిప్రాయపడ్డారు. మండలి సమావేశాలకు హాజరై, శాసనసభను బహిష్కరించి ‘మాక్ అసెంబ్లీ’ పేరుతో నిరసన నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.