ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TDP 40TH ANNIVERSARY : రాజకీయ చైతన్యఝరికి 40 ఏళ్లు - తెదేపాకు 40 ఏళ్లు

TDP 40TH ANNIVERSARY :సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు ...అన్న నినాదంతో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ ఇవాళ 41వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తెలుగుజాతి కీర్తిపతాకల్ని- తెలుగువాడి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎగరేసిన తెదేపా.. తెలుగు దేశం పిలుస్తోంది.. రా.. కదలిరా అంటూ అన్న నందమూరి తారకరామారావు పిలుపుతో 1982 మార్చి 29వ తేదీన పురుడు పోసుకుంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకూ, సవాళ్లూ, సంక్షభాలకు కేంద్రబిందువుగా నిలిచింది ఈ పార్టీ. 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ను ఖంగుతినిపిస్తూ.. అధికారానికొచ్చిన తెలుగుదేశం ప్రజాభిమానాన్ని చూరగొంటూ.. ఎన్నో చరిత్రపుటల్ని తనపేరిట నిక్షిప్తం చేసుకుంది.

TDP 40TH ANNIVERSARY
TDP 40TH ANNIVERSARY

By

Published : Mar 29, 2022, 5:39 AM IST

TDP 40TH ANNIVERSARY : 1982 మార్చి 29 హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌. అప్పటికే...... అక్కడ చాలా మంది గుమికూడారు. దేశ, రాష్ట్ర రాజకీయ యవనికపై చోటు చేసుకోనున్న ఒక సంచలనానికి, చరిత్రకు సాక్షీభూతంగా నిలవబోతున్నామని... అప్పటికి వారికి తెలియదు. వారి ఎదురు చూపులకు తెరదించుతూ తెలుగు చిత్రసీమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా నీరాజనమందుకుంటున్న ఎన్టీఆర్‌ కారులోంచి దిగారు. అంతకు వారం రోజుల ముందే ఆయన రామకృష్ణా స్టూడియోస్‌లో నిర్వహించిన సమావేశంలో తన రాజకీయరంగ ప్రవేశం గురించి చూచాయగా చెప్పారు. అది ఎలా ఉండోబోతోందన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. దానికి కొనసాగింపే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని లెజిస్లేచర్స్‌ క్లబ్బులో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. 300 మందితో నాలుగు గోడల మధ్య నిర్వహించాలనుకున్న ఆ సమావేశానికి..ఎన్టీఆర్‌ అభిమానులు, ముఖ్యంగా యువత పెద్దఎత్తున తరలిరావడంతో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ఆవరణ నిండిపోయింది. సమావేశాన్ని అప్పటికప్పుడు లాన్‌లోకి మార్చాల్సి వచ్చింది. అక్కడ మాట్లాడిన ఎన్టీఆర్‌... రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. పార్టీ పేరేంటో చెప్పాలని కొందరు అడిగారు. ఆయన చిరు నవ్వు నవ్వి..‘నేను తెలుగువాడిని. నాది తెలుగుదేశం పార్టీ!’ అన్నారు. అలా పురుడు పోసుకున్న తెలుగుదేశం పెను సంచలనమే సృష్టించింది.

ఆవిర్భవించిన తొమ్మిది నెలలకే: తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్‌ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి కొత్త తరహా రాజకీయాన్ని పరిచయం చేసింది. ‘తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా..!’ అని ఎన్టీఆర్‌ పిలుపునిస్తే జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. రాజకీయ పార్టీల సమావేశాలకు జనాన్ని తరలించే సంస్కృతికి తెరదించి... చైతన్య రథమెక్కి ఎన్టీఆర్‌ జనం మధ్యకు తరలివెళ్లారు. ఎక్కడ గ్రామం కనిపిస్తే అక్కడే బహిరంగ సభ. చైతన్య రథంలోనే పడక. రోడ్డు పక్కనే స్నానపానాదులు. అలా ఒక కొత్త ఒరవడికి ఎన్టీఆర్‌ తెరతీశారు. ఆయన వస్తున్నారంటే ఊళ్లకు ఊళ్లే తరలి వచ్చేవి. అలా కొద్ది రోజుల్లోనే మహా ప్రభంజనంలా మారిన తెదేపా... ఆవిర్భవించిన తొమ్మిది నెలలకే 1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే పార్టీకి మొదటి కుదుపు ఎదురైంది. 1984ఆగస్ట్‌ సంక్షోభంలో ఎన్టీఆర్‌ పదవీద్యుతులయ్యారు. అమెరికాలో గుండె శస్త్రచికిత్స చేయించుకుని వచ్చిన ఎన్టీఆర్‌ తన ఆరోగ్యాన్నీ లెక్కచేయకుండా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి సారథ్యం వహించారు. నెల రోజులు సాగిన ప్రజా ఉద్యమానికి....... అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దిగిరాక తప్పలేదు. ఎన్టీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రయ్యారు. ఎన్టీఆర్‌ హయాంలో 1983, 1985, 1989, 1994లో శాసనసభకు ఎన్నికలు జరగ్గా, మూడుసార్లు తెలుగుదేశం ఘన విజయం సాధించింది. గెలిచిన మూడు సార్లూ 200కిపైగా స్థానాలు దక్కించుకుంది.

సంక్షేమపథకాలు: 2రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కాగృహాలు, వ్యవసాయ పంప్‌సెట్లకు 50రూపాయలకే విద్యుత్‌ వంటి సంక్షేమపథకాల్నిఎన్టీఆర్‌ ప్రవేశపెట్టారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, మండల పరిషత్‌ల ఏర్పాటు వంటి పాలన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.1994 శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత.... పార్టీలో అంతర్గత పరిణామాలు నాయకత్వ మార్పునకు దారితీశాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1995 సెప్టెంబరు 1న చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. పార్టీ అధ్యక్షునిగాను ఎన్నికయ్యారు. 1999లో శాసనభ ఎన్నికల్లో..... 180 స్థానాలు గెలుచుకుని చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని కూడా లేని పరిస్థితుల్లో.... రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జరిగిన 2014 ఎన్నికల్లో చంద్రబాబు అనుభవానికి రాష్ట్ర ప్రజలు పట్టంకట్టారు. ఆ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రయ్యారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక..అభివృద్ధి, సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చారు. హైదరాబాద్‌ని ఐటీ, బయోటెక్‌ పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన చొరవ వల్లే అనేక ఇంజినీరింగ్‌ కాలేజీలు వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... రాజధాని అమరావతి నిర్మాణానికి బృహత్‌ ప్రణాళిక సిద్ధం చేసి, నిర్మాణం ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కీలక దశకు తెచ్చారు. కియా, అపోలో టైర్స్, ఏషియన్‌ పెయింట్స్‌ వంటి పరిశ్రమల్ని తీసుకొచ్చారు. తిరుపతికి పలు సెల్‌ఫోన్‌ కంపెనీల్ని తెచ్చారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నేతృత్వంలో కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమాన్ని తెలుగుదేశం అమలు చేస్తోంది. ప్రతి క్రీయాశీలక కార్యకర్తకూ 2 లక్షల రూపాయల ప్రమాద బీమా భరోసా కల్పించారు. ఇప్పటివరకు ప్రమాదాలకు గురైన 4,844 కార్యకర్తల కుటుంబాలకు 96 కోట్ల 88 లక్షల రూపాయల బీమా పరిహారం అందజేశారు. కార్యకర్తల పిల్లల చదువుల కోసం 2కోట్ల 35 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు.

ఇదీ చదవండి :వైకాపా ప్రభుత్వ తప్పులతోనే పోలవరం నిర్వీర్యం: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details