ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎలాంటి ఆంక్షలు విధించినా.. చలో తాడేపల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని.. విద్యార్థి సంఘాలు తేల్చిచెప్పాయి. చలో తాడేపల్లి కార్యక్రమానికి వెళ్తుతున్న కడప జిల్లా విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతపురం జిల్లాలో విద్యార్థి, యువజన సంఘాల నేతల్ని ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. చలో తాడేపల్లి కార్యక్రమానికి బయలుదేరిన తెదేపా యువనేత జేసీ పవన్‌రెడ్డిని.. అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తెదేపా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చంద్ర దండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడును బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.ఉద్యోగాల కోసం ఉద్యమ బాట పట్టిన విద్యార్థులపై పోలీసుల వైఖరి ఎమర్జెన్సీని తలపిస్తోందని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.
కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్..
చలో తాడేపల్లి కార్యక్రమానికి బయలుదేరిన తెలుగు యువత, తెలుగు విద్యార్థి నాయకులను నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల భర్తీలో కోతలు విధిస్తూ సీఎం నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని తెదేపా కార్యనిర్వహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ధ్వజమెత్తారు. చలో తాడేపల్లి కార్యక్రమంలో పాల్గొనటానికి వస్తున్న తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టులపై తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు మండిపడ్డారు. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.