పాత జాబ్ క్యాలెండర్‌ను రద్దు చేసి ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కలిపి నూతన క్యాలెండర్‌ను విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మంత్రివర్గ సమావేశంలో నిరుద్యోగుల సమస్యను ప్రభుత్వం విస్మరించటం దుర్మార్గమని ఉద్యోగ పోరాట సమితి ధ్వజమెత్తింది. నిరుద్యోగుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోలేదని, నిరసనలు చేపట్టిన యువతపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలపై శ్వేతపత్వం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చి కేవలం 10వేలు ప్రకటించడం మోసమేమనని మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు యువత ఆధ్వర్యంలో అఖిలపక్షం విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల సమయంలో జగన్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రజలను మోసం చేశారని నేతలు ఆరోపించారు. జాబులు ఇవ్వమని అడిగితే జైలుకు పంపిస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. జాబ్ క్యాలెండర్ మార్చే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. అరెస్ట్ అయిన వారిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, ప్రధాన కార్యదర్శి నాగశ్రావణ్ మరియు ఇతర సంఘాల నాయకులు ఉన్నారు.
సచివాలయ ముట్టడికి ఏబీవీపీ యత్నం..
జాబ్ క్యాలెండర్‌ను సవరించాలని సచివాలయ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తల ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
విజయనగరంలో..
రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నింటిలోని ఖాళీల భర్తీ చేసే విధంగా నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని.. విజయనగరంలో విద్యార్థి, నిరుద్యోగ, యువజన సంఘాల నేతలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కోట కూడలిలో ఎస్ఎఫ్ఐ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్యోగ సాధన సమితి, ఏఐవైఎఫ్ సంఘాల నేతలు పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్‌ను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనల సందర్భంగా పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను తక్షణమే రద్దు చేయాలని చీపురుపల్లిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సతీష్ దేవ్ సింగ్ ఆధ్వర్యంలో చీపురుపల్లి బస్ స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ తీశారు. నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలంటూ సతీష్ దేవ్ సింగ్ డిమాండ్ చేశారు.
కడపలో..